జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-5, 2019-21) ప్రకారం, దేశవ్యాప్తంగా మైనార్టీ తీరకుండానే పెళ్లిళ్లు చేసుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా ఉంది. చట్టబద్ధమైన వయసు రాకుండానే అంటే బాలికలకు 18 ఏళ్లు, బాలురకు 21 ఏళ్లు నిండకముందే వివాహం చేస్తున్న సందర్భాలు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నివేదిక ప్రకారం, 20-24 ఏళ్ల మధ్య వయసున్న యువతుల్లో 23.3 శాతం మందికి 18 ఏళ్లు నిండకముందే వివాహాలు జరిగాయి. దేశవ్యాప్తంగా బాల్యవివాహాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నప్పటికీ, ఇంకా పూర్తి స్థాయిలో నియంత్రణ సాధ్యం కాలేదని ఈ సర్వేలు తెలియజేస్తున్నాయి.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బాల్యవివాహాల రేటు ఎక్కువగా ఉన్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. NFHS-5 ప్రకారం, దక్షిణ భారతదేశంలో బాల్య వివాహాల విషయంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉండగా, తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌లో 29.3 శాతం మంది బాలికలకు చట్టబద్ధమైన వయసు రాకముందే వివాహాలు జరుగుతున్నాయని ఈ సర్వేలో తేలింది. ముఖ్యంగా ఏపీలోని అనంతపురం, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ఈ రేటు అత్యధికంగా 36 శాతం పైన ఉండడం గమనార్హం.
మరోవైపు తెలంగాణలో కూడా ఈ బాల్యవివాహాల శాతం ఆందోళనకరంగానే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 23.5 శాతం మైనార్టీ తీరని బాలికలకు వివాహాలు జరుగుతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో సరైన అవగాహన లేకపోవడం, ఆర్థిక, సామాజిక పరిస్థితులు బాల్యవివాహాలు జరగడానికి ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన NFHS-6 తాజా నివేదికల (2023-24) ప్రకారం, మైనార్టీ తీరకుండా వివాహం చేసుకునే బాలుర శాతం కూడా దేశవ్యాప్తంగా 15.9% గా ఉన్నట్లు తెలుస్తోంది.