కమలం చేరికల జోరుకు బ్రేక్..? కారణం అదేనా..?

ఒకప్పుడు జోరుగా సాగిన కమలం చేరికల జోరు ఇప్పుడు మందగించినట్లు కనిపిస్తోంది. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరాలనుకునే నేతలు ఇప్పుడు వెనకడుగు వేస్తున్నారు. కొత్తోళ్లు పార్టీలో చేరాలంటేనే జంకుతున్న పరిస్థితులు నెలకొన్నట్లు సమాచారం. బీజేపీలో చేరేందుకు విముఖత చూపుతున్నట్లు చర్చ చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం పార్టీలో తమకు దక్కే ప్రాధాన్యతపై నమ్మకం లేకపోవడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డిని బీజేపీలో చేర్చుకోవాలని సాగించిన ప్రయత్నాలు వృథా అవ్వడమే దీనికి కారణంగా తెలుస్తోంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ జీవన్ రెడ్డిని చేర్చుకోవాలనే అంశంపై తుది నిర్ణయాన్ని రాష్ట్ర నాయకత్వంపైనే వదిలేసినట్లు సమాచారం. అయినా ఆయన చేరేందుకు సుముఖత చూపకపోవడంతో శ్రేణుల్లో చర్చ మొదలైంది. ఎందుకంటే పార్టీలో చేరిన తర్వాత సరైన ప్రాధాన్యత దక్కుతుందా? లేక నామమాత్రంగానే ఉండిపోవాల్సి వస్తుందా? అన్న సందేహమే ఆయన్ని ఆపేసిందని సమాచారం.

 

పట్టించుకునేది ఎవరు..?

తెలంగాణ కాషాయ పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులు పలువురు చేరుతున్నారు. కానీ.. ఇటీవల కాలంలో చెప్పుకోదగ్గ స్థాయి నేతలెవరూ చేరింది లేదు. ఎందుకంటే కొత్తగా చేరాలనుకునే నేతల మదిలో.. అసలు ఆ పార్టీలో ఎవరికి ప్రాధాన్యత ఉంది? అనే ప్రశ్నే మెదులుతోందని తెలుస్తోంది. గత బీఆర్ఎస్ పాలనలో కీలకంగా ఉన్న ఈటలకు కూడా పార్టీ పరంగా ప్రాధాన్యత ఇవ్వకపోవడమే దీనికి నిదర్శనంగా చూపుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా పార్టీ సిద్ధాంతాలను నమ్ముకుని దశాబ్దాలుగా జెండా మోస్తున్న పాత క్యాడర్‌కే ఇప్పుడు కూడా సరైన గుర్తింపు లేదన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీనే నమ్ముకున్న కొందరు నాయకులు లోలోపల కుమిలిపోతున్నారు. సిద్ధాంతాలున్న తమనూ పట్టించుకోవడంలేదు.. లేని ఈటలను కూడా పట్టించుకోవడంలేదని, మరి ఇంకెవరిని పట్టించుకుంటారని తమ సన్నిహితుల వద్ద వాపోతున్న పరిస్థితి నెలకొంది. కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన వారికే మొండిచేయి ఎదురవుతున్నప్పుడు, ఇప్పుడు కొత్తగా వెళ్తే తమ పరిస్థితి ఏంటనేది కొత్తోళ్ల ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పాత, కొత్త నేతల మధ్య సమన్వయం లేకపోవడం, గ్రూపు రాజకీయాలు కూడా ఆశావహులను భయపెడుతున్నాయి.

 

సోషల్ మీడియాలో వైరల్..

కమలం పార్టీ.. సిద్ధాంతాల పరంగా స్ట్రాంగ్ గా ఉన్నా రాజకీయంగా మైలేజ్ ఇచ్చే విషయంలో హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరుపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పదవులు దక్కకపోయినా పర్వాలేదు కానీ, కనీస గౌరవం, ప్రాధాన్యత లేనప్పుడు పార్టీ మారడం అనవసరమని పలువురు నేతలు ఒక నిర్ణయానికి వస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే ప్రస్తుతానికి బీజేపీ వైపు చూడటానికి ఎవరూ సాహసించడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా కాషాయ పార్టీలోకి జీవన్ రెడ్డిని చేర్చుకునేందుకు ఎంపీ అర్వింద్.. కేంద్ర మంత్రి అమిత్ షాతో స్వయంగా ఫోన్ కాల్ మాట్లాడించారనే ప్రచారం కూడా పార్టీలో జరుగుతోంది. జీవన్ రెడ్డికి రాజ్యసభ ఎంపీ, తన కోడలికి ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ చేసినా రిజెక్ట్ చేశారనే అంశం సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. కానీ ఇది ఎంత వరకు నిజమన్న అంశంపై అర్వింద్ వర్గం నుంచి ఎలాంటి స్పష్టతా రాలేదు. మొత్తానికి చేరికల ద్వారా బలం పెంచుకోవాలనుకుంటున్న బీజేపీకి ప్రాధాన్యత అంశం ఇప్పుడు పెద్ద అడ్డంకిగా మారిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *