ఈ వార్త కొంచెం వింతంగా ఉంది. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఏపీకి అమరావతి రాజధాని అని స్పష్టతనిచ్చిన క్రమంలో.. ఆయన దీంతో పాటు ఏపీకి ప్రత్యేక హోదా కూడా ఇవ్వాలి అని అడగడమే దీనికి కారణమైంది. తనే స్వయంగా దీనిపై ఓ వీడియో తీసి పెట్టారు. ఆయన సొంత యూట్యూబ్ చానెళ్లో సమకాలీన రాజకీయ పరిస్థితులపై విశ్లేషణలు చేస్తూ ఉంటారు.
అయితే నాగేశ్వర్‌ను వైఎసీపీకి కొమ్ము కాస్తున్నావంటూ వ్యక్తిగతంగా ఆయన్ను టార్గెట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని టీడీపీ గట్టిగా అడిగే పరిస్థితి లేనందున తాను విశ్లేషణలో భాగంగా ఈ డిమాండ్‌ను తెరపైకి గట్టిగా తీసుకొచ్చానని ఆయన చెప్పారు.
ప్రత్యేక హోదా డిమాండ్‌ను ఇప్పుడు అక్కడ ఏ పార్టీ కూడా చేసే పరిస్థితి లేదన్నారు ప్రొఫెసర్. టీడీపీ కూటమి కేంద్రానికి మద్ధుతుగా ఉన్న నేపథ్యాన్ని గుర్తు చేశారు. ఇక జగన్‌కు ఈడీ, సీబీఐ కేసులున్నందున కేంద్రంతో సత్సంబంధాలే కొనసాగించేందుకు సిద్దంగా ఉన్నారని, ఆ క్రమంలో ఆయన ప్రత్యేక హోదా వాయిస్‌ను ఆ పార్టీతో పెద్దగా వినిపించలేకపోయారన్నారు.
ఇక బీజేపీ కూడా దీనిపై సైలెంట్‌గా ఉన్నదని, కానీ టీడీపీకి చెందిన కొందరు మాత్రం తనను టార్గెట్ చేయడమే ఆశ్చర్యంగా ఉందన్నారు ప్రొఫెసర్.
ఏపీ ప్రజలకు మేలు చేసే పనికి నేను పూనుకుంటే వీరికి బాధెందుకవుతుంది..? తాను ఇక్కడి ప్రజలకు మేలు జరగాలనే ఉద్దేశంతోనే అన్నానని, నిధులు కేటాయించాలనడం తన తప్పెలా అవుతుందని ఆయన ఆవేదనతో ఓ వీడియోను విడుదల చేశారు. తనకు జగన్‌తో సంబంధాలున్నాయని, అందుకే ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా వీడియోలు పెడుతున్నారంటూ తప్పుడు థంబ్‌నెయిల్స్‌తో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.
సోషల్ మీడియాలో తనపై మాటల దాడి చేస్తున్నది టీడీపీకి చెందిన బ్యాచేనన్న ప్రొఫెసర్.. ఏ పార్టీ కూడా మాట్లాడలేని టాపిక్‌ను ఏపీ ప్రజల కోసం ప్రత్యేక హోదా అడిగితే ఇలాంటి చర్యలకు దిగడం దారుణమన్నారు.