కేంద్ర ఆర్థిక సర్వే 2023-24 విడుదల..

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ఆర్థిక సర్వే 2023-24ను ప్రవేశ పెట్టారు. వి. అనంత నాగేశ్వరన్ ఆధ్వర్యంలో ఈ నివేదికను రూపొందించారు. బడ్జెట్‌లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై చాలా నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. రేపు జరగబోయే సమావేశంలో కేంద్ర మంత్రి బడ్జెట్ 2024-25‌ను ప్రకటిస్తారు.

 

కేంద్రంలో మూడోసారి అధికార పగ్గాలు చేపట్టిన ఎన్‌డీఏ సర్కార్ బడ్జెట్ సమర్పించేందుకు పార్లమెంట్ సోమవారం సమావేశం అయింది. ఈ బడ్జెట్ సమావేశాలు ఆగస్టు 12 వరకు జరగనున్నాయి. సోమవారం పార్టమెంట్‌లో కేంద్రం ఆర్థిక సర్వే ప్రవేశపెట్టింది. మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ మిగిలిన నెలలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశాల్లో 6 బిల్లులను సభ ఆమోదం కోసం కేంద్రం తీసుకురానుంది. మరోవైపు నీట్ పేపర్ లీకేజీ, కావడి యాత్ర వివాదాలపై కేంద్రాన్ని నిలదీయడానికి విపక్షాలు సిద్ధమయ్యారు.

 

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామణ్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ దేశ వాస్తవ జీడీపీ 6.5-7 శాతం వరకు వృద్ధి చెందుతుందని అంచనా వేసారు. బడ్జెట్ 2024-25 లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై చాలా నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. అంతే కాకుండా 11 దశల్లో దీనిపై చర్చలు జరిగాయని వెల్లడించారు. ముఖ్యంగా 63 నేరాలను డీక్రిమినలైజేషన్ చేయడం వల్ల ప్రస్తుతం కంపెనీలు సమర్థవంతంగా కొనసాగుతున్నాయని ఆమె పేర్కొన్నారు.

 

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో 2024-25 కు సంబంధించిన మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అందులో స్థిరత్వానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. భవిష్యత్ ప్రాధాన్యతలను స్పష్టం చేస్తూ పూర్తిస్థాయి బడ్జెట్‌ను మంగళవారం ప్రవేశపెట్టనుంది కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. నిర్మలా సీతారామణ్ ప్రవేశపెట్టనున్నఈ బడ్జెట్ ఏడవది. కొత్త పద్దులు అభివృద్ధి, సంక్షేమాల మధ్య ప్రభుత్వం సమతూకం పాటించాలని, వృద్ధికి ఊతమివ్వడమే కాకుండా ద్రవ్యోల్బణంపై దృష్టి సారించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

 

ప్రధాని మోదీ పదే పదే ప్రస్తావిస్తున్న వికసిత్ భారత్ 2047 విజన్‌కు అనుగుణంగా మౌలిక వసతుల అభివృద్ధి, రక్షణ రంగంలో ఆధునీకరణ, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్య సేవలు తదితర రంగాలపై కేంద్రంలో బడ్జెట్ ప్రధానంగా దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయి. మధ్యంతర పద్దుల మౌలిక వసతుల కల్పనకు కేంద్రం సముచిత ప్రాధాన్యం ఇచ్చింది. మూలధన పెట్టుబడుల కోసం రూపాయలు 11.11 కోట్లు కేటాయించింది.

 

అంతకుముందు బడ్జెట్‌తో పోలిస్తే ఇది ఏకంగా 11%పెరిగింది. పూర్తిస్థాయి బడ్జెట్‌లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయడం దాదాపు ఖాయమే అని చెప్పవచ్చు. ముఖ్యంగా రహదారులు, రైల్వే, గృహనిర్మాణ రంగాలకు కేటాయింపులు పెరిగే అవకాశం ఉంది, ప్రధాన పంటలకు కనీస మద్దతు ధర పెరగాలని రైతులు ఆశిస్తున్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద అందించే నగదు సాయం పెంపుపైన అన్నదాతలు కూడా ఆశలు పెట్టుకున్నారు. దేశీయంగా ఉత్పత్తి రంగాన్ని మరింత ప్రోత్సహించాలని కేంద్రం భావిస్తోంది. మరి ఆ దిశగా బడ్జెట్ కేటాయింపులు ఉంటాాయో వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *