మాజీ సీఎం జగన్ సీరియస్..!

ప్రముఖ ఆంగ్ల దినపత్రిక డెక్కన్ క్రానికల్ ఆఫీసుపై కొందరు దాడికి దిగారు. విశాఖపట్నంలోని డీసీ కార్యాలయంపై గుంపుగా వెళ్లి కొందరు ఆఫీసు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హోర్డింగ్‌కు నిప్పు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఘటనపై సదరు సంస్థ తీవ్రంగా స్పందించింది. ట్విట్టర్‌లో ఆ వీడియోను పోస్టు చేసి.. టీడీపీ కార్యకర్తలపై ఆరోపణలు చేసింది. తాము విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై నిఖార్సుగా, నిష్పక్షపాతంగా ఓ రిపోర్ట్‌ను ప్రచురించామని, అందుకే టీడీపీ గూండాలు తమ కార్యాలయంపై దాడది చేశారని ఆరోపించింది. ఇలాంటి బెదిరింపు చర్యలు ద్వారా ప్రభావితం చేయలేరని, తమ నోళ్లకు సంకెళ్లు వేయలేరని స్పష్టం చేసింది. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలను ట్యాగ్ చేసింది.

 

ఈ ఘటనపై మాజీ సీఎం, వైసీపీ చీఫ్ జగన్ కూడా సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. ఆయన రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వంపై విమర్శల దాడి చేశారు. డెక్కన్ క్రానికల్ ఆఫీసుపై దాడి చేసిన పిరికిపందల చర్యను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. టీడీపీతో సంబంధం ఉన్నవాళ్లే ఈ దాడికి దిగారన్నారు.

 

టీడీపీ చెప్పిన బాటలో నడవకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించే మీడియా గొంతు నులుమాలని టీడీపీ చేస్తున్న ప్రయత్నాల్లో ఇదీ ఒకటి అని జగన్ ఫైర్ అయ్యారు. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం తరచూ ఖూనీ అవుతున్నదని, వీటన్నింటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

 

గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అపూర్వ విజయాన్ని సాధించింది. అంతకు క్రితం వైసీపీ పార్టీ 151 సీట్లు గెలుచుకోవడం అద్భుతంగా భావించారు. కానీ, ఈ రికార్డును బ్రేక్ చేస్తూ కూటమి 164 అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది. ఇది ప్రజలు ఏకపక్షంగా ఇచ్చిన తీర్పుగా విశ్లేషకులు చూశారు. వైసీపీ ప్రభుత్వంపై ఏర్పడ్డ తీవ్ర వ్యతిరేకత కూటమి అఖండ విజయానికి దోహదపడిందని వివరించారు. ఈ దెబ్బతో మొన్నటి వరకు అధికారంలో ఉన్న వైసీపీ.. కనీసం ప్రతిపక్ష హోదాను కూడా పొందలేకపోయింది. వైసీపీ 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయింది. ఏకకాలంలో 140 సీట్లను జగన్ పార్టీ కోల్పోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *