రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. కాల్పుల్లో వైద్యుడు సహా ఆరుగురు మృతి ..

జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. గాందర్‌బల్ జిల్లాలోని సోన్‌మార్గ్ ప్రాంతంలో ఓ సొరంగ మార్గం నిర్మాణ ప్రదేశంలో ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ వైద్యుడు సహా మరో ఐదుగురు వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.

 

ఉగ్రవాదుల కోసం వేట కొనసాగిస్తున్నాయి భద్రతా దళాలు. దాడి చేసిన వారిని గుర్తించడానికి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. పరిస్థితిని అంచనా వేయడానికి కాశ్మీర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజిపి), వికె బిర్డితో సహా ఉన్నత భద్రతా అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

 

ఈ దాడిని జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. ఇదో పిరికిపంద చర్యగా పేర్కొన్నారు. సోన్ మార్గ్ ప్రాంతంలో స్థానికేతర కార్మికులపై దాడి దిగ్భ్రాంతికరమని అన్నారు. ఇది దారుణ ఘటన అని వ్యాఖ్యానించారు.

 

బాధితులు కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో పనిచేస్తున్నారు. నిరాయుధులైన అమాయకులపై జరిగిన ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అని ఒమర్ అబ్దుల్లా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు.

 

ఇద్దరు ఉగ్రవాదులు తుపాకులతో కాల్పులు జరపడంతో ఆరుగు మృతి చెందారని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. మరో ముగ్గురు గాయపడ్డారని తెలిపారు. కాగా, రెండు రోజుల క్రితమే షోపియాన్ జిల్లాలో బీహార్‌కు చెందిన వలస కార్మికుడిని ఉగ్రవాదులు చంపారు. కేంద్ర పాలిత ప్రాంత ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేసిన నాలుగు రోజులకే ఈ దాడులు జరిగాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *