సొంత కొడుకై ఉండి జగన్ ఈ పథకాన్ని నీరుగార్చారు: షర్మిల..

ఫీజు రీయింబర్స్ మెంట్ అంశంలో మాజీ సీఎం జగన్ పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మానస పుత్రిక అని, మహానేత హయాంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన ఒక ప్రతిష్ఠాత్మక పథకం అని వెల్లడించారు. పేద బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపి, ఎంతో మంది ఇంజినీర్లను, డాక్టర్లను తయారుచేసిన గొప్ప పథకం అని షర్మిల అభివర్ణించారు.

 

అయితే, నాడు ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని వైఎస్సార్ అద్భుతంగా అమలు చేస్తే… ఆయన సొంత కొడుకై ఉండి జగన్ ఈ పథకాన్ని నీరుగార్చారని విమర్శించారు. జగన్ హయాంలో విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజులు రూ.3,500 కోట్లు పెండింగ్ లో పెట్టడం నిజంగా సిగ్గుచేటు అని పేర్కొన్నారు.

 

బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడారని, తల్లిదండ్రులను మనోవేదనకు గురిచేశారని మండిపడ్డారు. దోచుకుని దాచుకోవడం మీద ఉన్న శ్రద్ధ విద్యార్థుల సంక్షేమంపై చూపలేదని ధ్వజమెత్తారు.

 

వైఎస్సార్ తన జీవితం మొత్తం మత పిచ్చి బీజేపీని వ్యతిరేకించారని, కానీ అదే బీజేపీకి జగన్ దత్తపుత్రుడు అయ్యారని షర్మిల విమర్శించారు. బీజేపీతో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిన మోదీ వారసుడు జగన్ అని అభివర్ణించారు. అలాంటి వ్యక్తులకు వైఎస్సార్ ఆశయాలు గుర్తుంటాయని అనుకోవడం, వారు వైఎస్సార్ ఆశయాలకు వారసులు అవుతారని అనుకోవడం పొరపాటు అని స్పష్టం చేశారు.

 

గత వైసీపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తే, నేడు కూటమి ప్రభుత్వం ఆ పథకాన్ని నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. వైసీపీ చేసింది మహాపాపమైతే, కూటమి సర్కారు విద్యార్థులకు పెడుతున్నది శాపమని విమర్శించారు.

 

“ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబును డిమాండ్ చేస్తున్నాం… బకాయిలు ఎవరు పెట్టినా, వాటిని విడుదల చేయాల్సిన బాధ్యత మీపై ఉంది. వెంటనే నిధులు విడుదల చేయండి… ఫీజు రీయింబర్స్ మెంట్ పథకానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ తరఫున స్పష్టం చేస్తున్నాం” అని షర్మిల సోషల్ మీడియాలో స్పందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *