విశాఖలో సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులతో భేటీ..!

టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటకు వెళ్లనున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి విశాఖ, విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. విజయవాడ నుంచి నేరుగా ఉదయం 10 గంటలకు విశాఖ చేరుకుంటారు.

 

అనకాపల్లి సమీపంలోవున్న దార్లపూడి వద్ద పోలవరం ఎడమ కాలువను పరిశీలిస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు భోగాపురం ఎయిర్‌పోర్టును సందర్శిస్తారు. పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించనున్నారు. అనంతరం సీఐఐ కాన్ఫరెన్స్‌లో వర్చువల్‌గా పాల్గొంటారు. మెడ్‌టెక్ జోన్ వర్కర్లతో సమావేశం కానున్నారు సీఎం.

 

సాయంత్రం విశాఖ ఎయిర్‌పోర్టు లాంజ్‌లో అధికారులతో సమావేశమై నిలిచిపోయిన పలు ప్రాజెక్టులపై సమీక్ష చేయనున్నారు. పనిలోపనిగా విశాఖలో డీసీ ఆఫీసును టీడీపీ కార్యకర్తలు తగలబెట్టిన విషయంపై ఆయన మీడియాతో మాట్లాడే ఛాన్స్ ఉంది. రాత్రికి ఉండవల్లికి చేరుకోనున్నారు.

 

అయితే ఈ టూర్‌లో భాగంగా గత సర్కార్ రుషికొండ‌లో నిర్మించిన ప్యాలెస్‌లను సీఎం చంద్రబాబు విజిట్ చేసే అవకాశముందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఎందుకంటే దాని సంబంధించిన రకరకాల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. భవనాలు అన్నీ పూర్తి కావడంతో ఆ భవనాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనే దానిపై సంబంధిత అధికారులతో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.

 

ఉత్తరాంధ్రలో ప్రస్తుతం ఇద్దరు కేంద్రమంత్రులు పర్యటిస్తున్నారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు భోగాపురంలో ఎయిర్‌పోర్టు పనులను పరిశీలించారు. కేంద్ర పరిశ్రమలశాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి విశాఖలో పర్యటిస్తున్నారు. స్టీల్‌ప్లాంట్ విషయమై సంబంధిత శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో ఇద్దరు మంత్రులతో సీఎం చంద్రబాబు సంబంధించిన పనులపై చర్చించే అవకాశముంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *