నిజాలు అంగీకరించడానికి ధైర్యం కావాలి. చాలామంది అస్సలు ఒప్పుకోరు. నిజం చెబితే తన ఇమేజ్ ఎక్కడ డ్యామేజ్ అవుతుందని భావిస్తుంటారు. ఈ విషయంలో వైసీపీలోని కొందరు నేతలు ఓ అడుగు ముందే ఉన్నారని చెప్పవచ్చు. తప్పుని నిజమని వాదించే తత్వవేత్తలు ఆ పార్టీలో వున్నారు . తాజాగా ఈవీఎం డ్యామేజ్ కేసులో సంచలన విషయాలు బయట పెట్టారు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.
మే 13న ఏపీ అసెంబ్లీ, పార్లమెంటుకు ఎన్నికలు జరిగాయి. ఆ రోజు ఈవీఎంను డ్యామేజ్ చేశారు వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఈ ఘటన జరిగి వారంరోజుల తర్వాత అసలు విషయం బయటకువచ్చింది. ఈ క్రమంలో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేయడం, ఆ తర్వాత ఆయన కోర్టుకు వెళ్లడం.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడం జరిగిపోయింది. న్యాయస్థానం ఇచ్చిన గడువు ముగియడంతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఇదే కేసులో న్యాయస్థానం అనుమతితో పిన్నెల్లిని పల్నాడు పోలీసులు విచారిస్తున్నారు.
సోమవారం విచారణ సమయంలో పెద్ద తతంగమే జరిగింది. పిన్నెల్లిని విచారించేందుకు సోమవారం ఉదయం 10 గంటలకే డీఎస్పీతోపాటు 11 మంది పోలీసులు నెల్లూరు జైలుకి వెళ్లారు. జైలు అధికారులు పోలీసులను లోపలికి అనుమతించలేదు. చివరకు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో న్యాయస్థానం నుంచి ఆదేశాలు రావడంతో అధికారులను జైలు లోపలికి అనుమతించారు. మధ్యాహ్నం మూడుగంటలకు మొదలైన విచారణ రాత్రి ఏడు వరకు సాగినట్టు తెలుస్తోంది. పిన్నెల్లి నుంచి నేను వెళ్లలేదు.. వాళ్లెవరో నాకు తెలీదు అనే జవాబులు ఎక్కువగా వచ్చినట్టు సమాచారం.
గురజాల డీఎస్సీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం పిన్నెల్లిని విచారించారు. పోలింగ్ జరిగిన రోజు తాను రెంటచింతల పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రానికి వెళ్లలేదని చెప్పేశారు. అంతేకాదు ఈవీఎంలను తాను పగల గొట్టలేదని, నావెంట ఆ రోజు గన్‌మెన్లు లేరని వివరించారు. ఈ క్రమంలో పోలీసులు వీడియోను దగ్గర పెట్టి చూపించారట. అది తాను కాదని, మరొకరని అన్నారట పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు ఎవరో కూడా తనకు తెలీదని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఈవీఎంలను ధ్వంసం చేయడమేకాకుండా, అడ్డు వచ్చిన టీడీపీ ఏజెంట్ నంబూరిపై దాడి చేయడం వంటి ఘటనపై ఆయనపై కేసు నమోదైంది. అంతేకాదు మరుసటి రోజు పరామర్శ పేరుతో కారంపూడిలో అల్లర్లకు పాల్పడడం విధుల్లోవున్న సీఐ నారాయణస్వామిపై రాయితో దాడి చేయంపై మరో కేసు కూడా నమోదైంది. ఆయా కేసులకు సంబంధించి మరింత సమాచారాన్ని ఆయన నుంచి రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
మిగతా కేసులకు సంబంధించి మంగళవారం విచారణ చేయనున్నారు పోలీసులు. అన్నట్లు ఈవీఎం డ్యామేజ్ కేసులో సాక్షాత్తూ వైసీపీ అధినేత జగన్ నిజం అంగీకరించారు. అక్కడ రిగ్గింగ్ జరుగుతుండడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను పగలగొట్టారని ఓపెన్‌గా స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఈ లెక్కన పార్టీ అధినేత మాటలను ఎవిడెన్స్‌గా తీసుకోవాలనే ఆలోచనలో పోలీసులు ఉన్నట్లు సమాచారం.