వైసీపీ అధినేత జగన్‌లో ఓ రకమైన భయం కనిపిస్తోంది. ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి అధికార పక్షాన్ని ఎదుర్కోవడానికి భయపడుతున్నారు. ఓటమిని అంగీకరించడానికి ఇబ్బంది పడుతున్నారు. కానీ.. 2029 ఎన్నికల ఫలితాలను ఇప్పుడే అంచనా వేస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసెంబ్లీలో ప్రమాణ స్వీకారానికి వెళ్లడానికి కూడా ఆయన చాలా ఇబ్బంది పడ్డారు. అసెంబ్లీకి వచ్చి డైరెక్ట్‌గా తన సభలోకి వెళ్లకుండా వైసీపీఎల్పీలోకి వెళ్లి కూర్చొన్నారు. తన ప్రమాణ స్వీకారానికి కొన్ని నిమిషాల ముందే సభకు వెళ్లి.. ప్రమాణం చేసి తర్వాత బయటకు వెళ్లిపోయారు. అంటే.. ఆయన ఎంత ఇబ్బంది పడుతున్నారో క్లియర్‌గా అర్థం చేసుకోవచ్చు.
ఇప్పటి వరకు అయితే.. అధికార పక్షం నుంచి ఆయనకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. కానీ.. అవమానం, అగౌరవం జరుగుతుందేమో అన్న భయంతో ఆయన సభలో ఉండటానికి ఇబ్బంది పడ్డారు. నిజానికి జగన్‌ని అగౌరవ పరచొద్దని చంద్రబాబు పార్టీ నేతలకు ఆదేశించారు. అందుకే.. ఆయన కారును అసెంబ్లీ గేటు దగ్గర ఆపకుండా నేరుగా లోపలకి అనుమతించారు. సాధారణ ఎమ్మెల్యేలంతా గేటు దగ్గరే కారు దిగి నడుచుకుంటూ వెళ్లాలి. కానీ.. ఆయనకు అలాంటి ఫార్మాలిటీస్ లేకుండా చూసుకున్నారు.
మరోవైపు అసెంబ్లీలో సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరగాలి. కానీ.. మంత్రుల తరువాత తనను పిలవాలని జగన్ కోరారు. ఆయన కోరిక మేరకే ప్రొటెం స్పీకర్ జగన్ ను పిలిచారు. అయినా.. ప్రమాణ స్వీకారం అయిన వెంటనే బయటకు వెళ్లిపోయారు. సభలో అధికార పక్షాన్ని ఎదుర్కోలేక పోతే ప్రజలు ఏ మాత్రం కూడా హర్షించరు. అంటే.. ప్రతిపక్షంలో ఉండటానికి జగన్ ఇష్ట పడటం లేదని.. నిత్యం అధికారం కావాలని కోరుకుంటున్నారనే సంకేతం ప్రజల్లోకి వెళ్తుంది. ఇది ప్రజల తీర్పును అవమానించడమే.
అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజల్లోకి వెళ్లి.. ప్రజల తరుఫున పోరాటం చేస్తామని జగన్ చెబుతున్నారు. కానీ.. కీలకమైన నిర్ణయాలు అసెంబ్లీలో తీసుకుంటారు. ప్రభుత్వ నిర్ణయాలను వైసీపీ అడ్డుకోలేక పోవచ్చు. కానీ.. ప్రజల తరుఫున తన వాయిస్ వినిపించొచ్చు. రేపటి రోజున ఎన్నికల ప్రచారంలో అదే వైసీపీకి ఆయుధంగా మారొచ్చు. అవేవీ పట్టించుకోకుండా టీడీపీ, జనసేనను ఫేస్ చేయడానికి ఇష్టపడటం లేదు. ఇలాగే చేసుకుంటే బీజేపీ 2 ఎంపీల నుంచి ఈ రోజు దేశంలో తిరిగి లేని శక్తిగా ఎదిగి ఉండేది కాదు. పార్టీకి ఏ మాత్రం బలం లేని సమయంలో కూడా వాజ్‌పాయ్ తన వాయిస్ ను పార్లమెంట్‌లో బలంగా వినిపించారు.
2019 ఎన్నికల్లో టీడీపీ 23 స్థానాలకే పరిమితమైంది. అప్పుడు చంద్రబాబు కూడా సభలకు రాను అని ఉంటే ఈ రోజు ఈ స్థాయి గెలుపు సాధ్యమైయ్యేది కాదు. 2021లో చంద్రబాబు సభకు వెళ్లలేదు. దానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి. రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేని తన భార్యను కించపరిచేలా మాట్లాడారు. దానికి ఆయన శపథం పూనారు. అందుకే సభలో అడుగుపెట్టలేదు. అంతేకానీ.. ఓటమి భయపడి చంద్రబాబు సభకు దూరం కాలేదు. 2018లో తెలంగాణలో కాంగ్రెస్ ఘోర ఓటమి తర్వాత కూడా సభకు వెళ్లింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా బీఆర్ఎస్ లో చేరిపోయారు. కానీ.. సభలో భట్టి విక్రమార్క ప్రజల తరుఫు తన వాయిస్ వినిపించారు. అందుకే 2023లో అధికారంలోకి వచ్చారు.
రేపు ఏం జరుగుతుందో అన్న భయంతో సభకు వెళ్లడం మానేస్తే పరిస్థితి వేరేలా ఉండేది. ఇక్కడ మరో విచిత్రం ఏంటంటే.. ప్రమాణ స్వీకారం రోజునే అసెంబ్లీకి వెళ్లడానికి ఇబ్బంది పడిన వ్యక్తి.. 2029లో టీడీపీ సింగిల్ డిజిట్‌కే పరిమితం అవుతుందని జోస్యం చెబుతున్నారు. ఏ కారణంతో ఆయన అలా చెప్పారో అర్థం కావడం లేదు. ఇంకా పాలన మొదలు కాలేదు. కానీ.. ప్రజలు తిరస్కరిస్తారని ఎలా చెబుతారు? పాలన మొదలై.. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే.. వాటిని ప్రమానికంగా తీసుకొని ఓడిపోతారని చెప్పొచ్చు. కానీ.. ఆలూ లేదు.. సూలు లేదు కొడుకు పేరు రామలింగం అన్నట్టు ఉంది జగన్ వాలకం.
నిజంగానే ఆయన భయపడినట్టు సభలో అవమానాలు, అగౌరవాలు ఎదుర్కోవాల్సి వస్తే అదే ప్రజల్లో సింపతీ పెంచుతుంది. అయితే.. రాజకీయాల్లో కష్టాలు ఎదుర్కోవడం జగన్ కు కొత్తేం కాదు. పార్టీ స్థాపించినపుడు జగన్, విజయమ్మ తప్ప ఎవరూ లేరు. కానీ, ఆ తర్వాత ఊహించని ఫలితాలు జగన్ సొంతం చేసుకున్నారు. ఎవరు కాదనుకున్నా.. జగన్ పోరాటమే 2019లో ఆయన్ని గెలిపించింది. సభలో తన వాయిస్ వినిపించి.. తర్వాత దాని గురించి ప్రజల్లో చర్చించాలి. అలా కాకుండా సభకు వెళ్లకుండా ప్రజల్లో ఏ అంశంపై చర్చిస్తారు? వీటిని దృష్టిలో పెట్టుకొని వైసీపీ అధినేత అసెంబ్లీకి హాజరైతే మంచిది.