డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీ సెషన్స్ ముగించుకుని తిరిగి వెళ్తున్న సమయంలో జనసేన పార్టీ కార్యాలయం వద్ద కాన్వాయ్ ఆపారు. జనవాణి కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన జనవాణి కేంద్రంలో సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన ప్రజలతో నేరుగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఆఫీసు ముందు కుర్చీ వేసుకుని కూర్చుని బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారికి సమస్యలకు సంబంధించి అప్పటికప్పుడు అధికారుతో ఫోన్లో మాట్లాడారు. అంతే కాకుండా బాధితుల సమస్యలకు పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.
ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాలనలో తనదైన ముద్ర వేసుకుంటున్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి వరుస సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తూ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. శనివారం అసెంబ్లీకి వచ్చిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి ప్రసంగించారు. స్పీకర్ అన్నయ పాత్రుడిని గురించి పవన్ మాట్లాడారు. ఆ తర్వాత ఏపీ శాసనసభను నిరవధికంగా వాయిదా వేశారు. అనంతరం జనసేన పార్టీ కార్యాలయానికి పవన్ చేరుకున్నారు. అక్కడ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమంలో పాల్గొన్నారు.
భీమవరం నుంచి వచ్చిన శివకుమారి అనే బాధితురాలు తన కుమార్తె మైనర్ అని, ఆమెను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి కిడ్నాప్ చేశారని, గత తొమ్మది నెలలుగా తన కూతరు ఆచూకి తెలియడం లేదని పవన్ కళ్యాణ్ ముందు కన్నీటి పర్యంతం అయింది. ఘటనపై మాచవరం పోలీసులు స్పందించడం లేదని వాపోయింది. దీంతో మాచవరం సీఐకి ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీనిపై చర్యలకు కూడా ఆదేశించారు. పార్టీ నాయకులను, బాధితులను పార్టీ ఆఫీస్ వాహనంలో మాచవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు.