దేశంలో భారీ వర్షాలు.. కురుస్తాయి: IMD..

దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ-ఐఎండీ మరో చల్లటి వార్తను చెప్పింది. నైరుతి రుతుపవనాలు నికోబార్ దీవుల్లోకి ప్రవేశించాయని, మాల్దీవులు సహా నికోబార్ దీవులు, దక్షిణ అండమాన్ ప్రాంతాలను ఆదివారం తాకనున్నాయని వాతావరణ శాఖ పేర్కొన్నది. అదేవిధంగా మే 31వ వరకు ఈ నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయని ఐఎండీ తెలిపింది.

 

అయితే, భారత వాతావరణ శాఖ ప్రకారం.. కేరళలో రుతుపవనాలు ప్రవేశ సమయం గత 150 సంవత్సరాల నుంచి మారుతూ వస్తుందని పేర్కొన్నది. కేరళలో రుతుపవనాలు 2020లో జూన్1, అదేవిధంగా 2021లో జూన్ 3న, 2022లో మే 29న, 2023 జూన్8న తీరాన్ని తాకాయని తెలిపింది. అయితే, గత 150 ఏళ్లలో మొదటిసారిగా 1918లో మే 11న రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయని, అత్యంత ఆలస్యంగా 1972లో జూన్ 18వ తేదీన కేరళ తీరాన్ని తాకి నికోబార్ దీవుల్లోకి రుతుపవనాలు ప్రవేశించాయని ఐఎండీ పేర్కొన్నది.

 

సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం ఈ ఏడాది నమోదవుతుందని ఇటీవల వాతావరణ శాఖ అంచనా వేసిన విషయం తెలిసిందే. దీర్ఘకాల సగటు ఎల్పీఏతో పోల్చగా వచ్చే రుతుపవనాల సీజన్ లో 106 శాతం వరకు వర్షపాతం నమోదు కావొచ్చని పేర్కొన్నది. అయితే, వచ్చే సీజన్ లో ఎల్పీఏ 87 సెంటీమీటర్లుగా వాతావరణ శాఖ అంచనా వేసింది. లానినా పరిస్థితులు వర్షాలు కురిసేందుకు అనుకూలంగా ఉన్నాయని, ఈ నేపథ్యంలోనే ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యే అవకాశముందని ఐఎండీ పేర్కొన్నది.

 

1951 నుంచి 2023 సంవత్సరం వరకు ఎల్‌నినో తరువాత లానినా వచ్చిన సమయాల్లో దేశంలో 9 సార్లు సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యిందని వాతావరణ శాఖ వెల్లడించింది. అదేవిధంగా లానినా ప్రభావంతో ఈసారి కూడా అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశముందని తెలిపింది. ఆగస్టు నుంచి సెప్టెంబర్ కాలంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని, ఇటు రుతుపవనాలు కూడా అందుకు అనుగుణంగా కదులుతున్నాయని ఐఎండీ పేర్కొన్నది. ఈ క్రమంలో ఈశాన్య, వాయవ్య, తూర్పున ఉన్నటువంటి రాష్ట్రాల్లో పలు ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం లేకపోలేదని వాతావరణ శాఖ వెల్లడించిన విషయం తెలిసిందే.

 

కాగా, శనివారం సాయంత్రం రాష్ట్రంలో భారీగా వర్షం కురిసిన విషయం విధితమే. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో వర్షం భారీగా కురిసింది. నగరంలోని ఉప్పల్, ఎల్బీనగర్, నాంపల్లి, దిల్ సుఖ్ నగర్, ఖైరతాబాద్, ఓల్డ్ సిటీ, పంజాగుట్ట, మెహిదీపట్నం, మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తోపాటు తదితర ప్రాంతాల్లో వర్షం భారీగా కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. నాలాలు పొంగిపొర్లాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో రోడ్లు చెరువులను తలపించాయి. పలు చోట్లా వాహనాలు నీటమునిగాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రంగంలోకి దిగిన పలు విభాగాల సిబ్బంది పరిస్థితులను చక్కబెట్టారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అయితే, గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో భిన్న వాతావరణం నెలకొంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *