సార్వ్రతిక ఎన్నికల ఐదో దశ పోలింగ్ సోమవారం ఉదయం ఏడు గంటలకు మొదలైంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 సీట్లకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. మొత్తం దాదాపు 9 కోట్ల మంది ఓటర్లు తమ ఓటును వినియోగించుకోనున్నారు. ఈ 49 స్థానాల్లో 40 ఎన్డీయే సిట్టింగ్ సీట్లు కావడంతో బీజేపీకి ఈ దశ కీలకంగా మారింది.
మహరాష్ట్రలోని 13 నియోజకవర్గాలపై అందరి దృష్టిపడింది. ఈసారి శివసేన, ఎన్సీపీలు రెండు గ్రూపులుగా చీలిపోయి పోటీ చేస్తున్నాయి. ముంబై సిటీపై శివసేన గ్రూప్ ప్రధానంగా దృష్టి కేంద్రకరించింది. బాలీవుడ్ స్టార్స్ ఫర్హాన్ అక్తర్, హీరోయిన్ జాన్వికపూర్, నటుడు అక్షయ్ కుమార్, బిజినెస్‌మేన్ అనిల్ అంబానీ వంటివారు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సెలబ్రిటీలు సచిన్, షారూఖ్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, అమీర్, హీరోయిన్లు ఉన్నారు.
ఈ దశ పోలింగ్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, పీయూష్ గోయల్, స్మృతి ఇరానీలతోపాటు సాధ్వీ నిరంజన్, శంతను ఠాకూర్ వంటి నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించు కోనున్నారు. జమ్మూకాశ్మీర్ బారాముల్లా నుంచి మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా సహా 22 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
యూపీలోని రెండు నియోజకవర్గాలపైనే అందరి దృష్టి నెలకొంది. కాంగ్రెస్ కంచుకోట రాయ్‌బరేలీ, అమేథీ లో ఆసక్తికర పోరు నెలకొంది. రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌గాంధీ, అమేథీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కేఎల్ శర్మ బరిలో ఉన్నారు. సోనియాగాంధీ రాయ్‌బరేలి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొన్నారు. మరి ఈసారి ఆయా నియోజకవర్గాల్లో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి. యూపీలో 14, మహారాష్ట్ర 13, బెంగాల్ 7, బీహార్ 5, ఒడిశా 5, జార్ఖండ్ 3, జమ్మూకాశ్మీర్, లడక్‌లో ఒక్కో స్థానంలో పోలింగ్ జరుగుతోంది.
ఒడిషాలోకి ఐదు లోక్‌సభ, 35 అసెంబ్లీ సీట్లకు పోలింగ్ మొదలైంది. సీఎం నవీన్ పట్నాయిక్ ఈసారి రెండు నియోజకవర్గాల నుంచి బరిలో ఉన్నారు. అస్కా లోక్‌సభ పరిధిలోని హింజిలి, బొలంగీర్ జిల్లాలోని కంటాబంజి నుంచి పోటీ చేస్తున్నారు. సీఎంతోపాటు పలువురు మంత్రులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎప్పుడు లేని విధంగా ఈసారి నవీన్‌కు వలసల తలనొప్పి తీవ్రమైంది.