రూ. లక్ష కోట్లు సీజ్ చేశాం.. అవినీతిపరులకు మోడీ హెచ్చరిక..

అవినీతికి పాల్పడే వారిని వదిలిపెట్టేది లేదన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. సోమవారం సాయంత్రం లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోడీ ప్రసంగించారు. తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తూనే కాంగ్రెస్ సహా విపక్షాలపై విరుచుకుపడ్డారు. తమ ప్రభుత్వం రైతులు, మహిళలు, యువతకు ప్రాధాన్యత ఇస్తోందని తెలిపరాు.

 

దేశంలో అవినీతిపరులపై దర్యాప్తులు సంస్థలు దాడులు చేస్తుంటే.. విపక్ష నేతలు వారికి మద్దతు పలుకుతూ ప్రభుత్వం విమర్శుల చేస్తున్నారని ప్రధాని మోడీ మండిపడ్డారు. గతంలో పార్లమెంటులో అవినీతి గురించే మాట్లాడేవాళ్లం.. వారిపై చర్యలకు డిమాండ్ చేసేవాళ్లం. కానీ, ఇప్పుడు అలాంటివేం లేవు. అయితే, ఇప్పుడు అవినీతిపరులపై దాడులు జరుగుతుంటే.. వారికి మద్దతుగా ఆందోళనలు చేస్తున్నారని విపక్ష నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

కాంగ్రెస్ హయాంలో ఏజెన్సీలను స్వార్థ రాజకీయాల కోసం వినియోగించుకున్నారని మండిపడ్డారు ప్రధాని మోడీ. కానీ, ఇప్పుడు అలా కాదని.. అవినీతిపరులపైనే దాడులు జరుగుతున్నాయన్నారు. అవినీతిపరులకు మద్దతుగా విపక్షాలు ఆందోళన చేస్తున్నాయని మండిపడ్డారు. అవినీతిపరులకు ఖచ్చితంగా శిక్షపడుతుందని స్పష్టం చేశారు.

 

కాంగ్రెస్ హయాంలో ఈడీ రూ. 5 వేల కోట్లు సీజ్ చేసింది. అయితే, తమ ప్రభుత్వ హయాంలో ఈడీ రూ. 1 లక్షల కోట్లు అవినీతి సొమ్మును స్వాధీనం చేసుకుందని ప్రధాని మోడీ తెలిపారు. అవినీతిపరులపై యుద్ధం కొనసాగుతుందన్నారు. దేశాన్ని దోచుకుంటే సహించేది లేదన్నారు. దోచుకున్న ప్రతీపైసాను కక్కిస్తామని ప్రధాని మోడీ తేల్చి చెప్పారు.

 

దేశంలో ఉగ్రవాదానికి, తీవ్రవాదానికి, నక్సలిజానికి స్థానం లేదన్నారు ప్రధాని మోడీ. తమ భద్రతాదళాలు వారిని నిర్ధాక్షిణ్యంగా అణిచివేస్తాయన్నారు. గతంలో కాశ్మీర్ విషయంలో ఎప్పుడూ ఆందోళనలు వ్యక్తమయ్యేవని.. కానీ, ఇప్పుడు అక్కడ జరుగుతున్న అభివృద్ధిపైనే చర్చ జరుగుతోందన్నారు ప్రధాని మోడీ. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్‌లో ప్రశాంత వాతావరణం నెలకొందన్నారు. అక్కడ జీ20 సమావేశాలు కూడా విజయవంతంగా నిర్వహించామన్నారు. జమ్మూకాశ్మీర్ ప్రజలు ప్రశాంత జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు.

 

దేశ ప్రజలందరితో కలిసి దేశాన్ని అభివృద్ధి పథం వైపు నడుపుతున్నామని చెప్పారు ప్రధాని మోడీ. విపక్షాలు కూడా తమతో కలిసి రావాలన్నారు. వికసిత్ భారత్ కోసమే తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. తమపై రాళ్లు విసిరితే వాటిని అభివృద్దికి ఉపయోగించుకుంటామన్నారు. తాము పేరు చెప్పుకునే వాళ్లం కాదని.. పనులు చేసుకుంటూ వెళ్తామని విపక్షాలకు కౌంటర్ ఇచ్చారు. తమ ప్రభుత్వం దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తుందని చెప్పారు. చివరగా రాష్ట్రపతి ప్రసంగానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *