400 సీట్లు పక్కా.. వచ్చే టర్మ్‌లో మూడో ఆర్ధిక వ్యవస్థగా భారత్..

బీజేపీ మూడో సారి అధికారంలోకి వస్తే భారత్ మూడో ఆర్ధిక వ్యవస్థగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. మూడో సారి ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని.. ఎన్డీయే కూటమికి 400 సీట్లు వస్తాయని అన్నారు. కేవలం భారతీయ జనతా పార్టీకే 370కి పైగా సీట్లు వస్తాయని స్పష్టం చేశారు. ఇక మూడో విడత పాలన వెయ్యేళ్ల పాటు గుర్తుంచుకునేలా ఉంటుందని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానం సందర్భంగా ఆయన లోక్ సభలో మాట్లాడారు. విపక్షాలపై నిప్పులు చెరిగారు. విపక్షాలు చాలా కాలం విపక్ష పాత్ర పోషించడానికి సంకల్పం తీసుకున్నాయని, వారి కోరికను దేవుడు నెరవేరుస్తాడని భావిస్తున్నానని తెలిపారు. ఎన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నారో అన్ని ఏళ్లు విపక్షంలో ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

 

ఇండియా కూటమి అలైన్‌మెంట్ దెబ్బతిందని.. ఒకరిపై ఒకరికి విశ్వాసం లేదని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. అలాంటి పార్టీలను దేశ ప్రజలు నమ్మరని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మైనారిటీల పేరిట రాజకీయాలు చేస్తుందని.. అలా ఎన్ని రోజులు చేస్తారని ప్రశ్నించారు. దేశానికి ఒక మంచి విపక్షం అవసరం ఉందని.. కాంగ్రెస్ పార్టీ ఆ పాత్రను పోషించడంలో ఫెయిల్ అయ్యిందన్నారు. వారసత్వ రాజకీయాలు వారి కొంప ముంచతాయని.. వారి వల్ల వేరే నాయకులు బాధితులయ్యారని ఖర్గే, ఆజాద్‌ను ఉద్దేశించి విమర్శించారు.

 

తాము అధికారంలోకి వచ్చాక 11వ స్థానంలో ఉన్న భారతదేశాన్ని 5వ స్థానానికి తీసుకొచ్చామని ప్రధాని మోదీ గుర్తుచేశారు. తాను మూడోసారి ప్రధాని అయ్యాక దేశం మూడో అతిపెద్ద ఆర్ధిక వ్వవస్ధగా ఎదుగుతుందని చెప్పారు. తాము సాధించిన అభివృద్ధిని సాధించాలంటే కాంగ్రెస్‌కు వందేళ్లు పడుతుందని అన్నారు. నెహ్రూ, ఇందిరా గాంధీలపై కూడా విమర్శలు గుప్పించారాయన.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *