ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా సీట్ల పంపకాల పైన ఒక నిర్ణయానికి వచ్చాయి. వచ్చే వారం అభ్యర్దులను ప్రకటించే అవకాశం ఉంది. ఇదే సమయంలో టీడీపీ నుంచి కొత్త తరం రాజకీయ నేతలు పోటీకి సిద్దమవుతున్నారు. నారా బ్రాహ్మణి ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది. నియోజకవర్గం పైనా నిర్ణయం జరిగిందని.. ఇక, ఈ అంశం పైన కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఎన్నికల్లో పోటీ: టీడీపీ నుంచి ఎన్నికల బరిలోకి మరో వారసురాలు ఎంట్రీకి రంగం సిద్దమైంది. వచ్చే ఎన్నికలు టీడీపీకి ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. ప్రతీ సీటు కీలకం అవుతోంది. ఈ సమయంలో అభ్యర్దుల ఖరారులో టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. మిత్రపక్షం జనసేనకు 25 -30 సీట్ల మధ్య ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది.
ఈ సమయంలోనే టీడీపీ నుంచి నారా బ్రాహ్మణి ని ఎంపీ అభ్యర్దిగా ఎన్నికల బరిలో నిలబెట్టబోతున్నారనే చర్చ పార్టీ సీనియర్లలో మొదలైంది. చంద్రబాబు అరెస్ట్ సమయంలో భువనేశ్వరి, నారా బ్రాహ్మణి ప్రజలతో కలిసి అనేక కార్యక్రమాలు నిర్వహించారు. బ్రాహ్మణి ప్రసంగాలకు మద్దతు కనిపించింది. దీంతో, వచ్చే ఎన్నికల్లో నారా బ్రాహ్మణి పోటీ చేయటం ద్వారా పార్టీకి కలిసి వస్తుందనే చర్చ మొదలైంది.
సీటు పైన చర్చ: బ్రాహ్మణి ఇప్పుడు పూర్తి హెరిటేజ్ బాధ్యతల్లో నిమగ్నమయ్యారు. భువనేశ్వరితో కలిసి బిజినెస్ వ్యవహారాలు చూస్తున్నారు. ఈ సమయంలో బ్రాహ్మణి రాజకీయాల్లో పోటీకి ఆసక్తి చూపుతారా అనే వాదన కూడా పార్టీలో ఉంది. అయితే, పార్టీలో బలమైన నాయకత్వం..ఎన్టీఆర్ వారసుల బాధ్యతలు పెంచాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
అందులో భాగంగానే బ్రాహ్మణి పేరు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. బ్రాహ్మణి ని విశాఖ లేదా విజయవాడ పార్లమెంట్ స్థానంలో పోటీ చేయించే అంశం పైన చర్చ జరుగుతున్నట్లు సమాచారం. విశాఖ నుంచి బాలయ్య అల్లుడు భరత్ సీటు ఆశిస్తున్నారు. కానీ, అక్కడ బ్రాహ్మణి పోటీ చేయటం ద్వారా విశాఖ పార్లమెంట్ తో పాటుగా ఉత్తరాంధ్రలోనూ సానుకూలత వస్తుందని అంచనా వేస్తున్నారు.
బ్రాహ్మణి పోటీకి సిద్దమేనా..!: ఇదే సమయంలో విజయవాడ నుంచి పోటీ చేసే అంశం పైన చర్చ చేస్తున్నారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో కొద్ది రోజులుగా టీడీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాల వేళ బ్రాహ్మణికి సీటు కేటాయిస్తే మొత్తం అనుకూలంగా మారుతుందని భావిస్తున్నారు. అయితే, ఈ సారి టీడీపీలో కుటుంబానికి ఒక్క సీటే ఇస్తామని చంద్రబాబు స్పష్టం చేస్తున్నారు.
ఇప్పటికే చంద్రబాబు, లోకేష్, నందమూరి బాలయ్య, విశాఖ నుంచి భరత్ పోటీ చేయటం దాదాపు ఖాయమైంది. ఈ సమయంలో బ్రాహ్మణికి సీటు ఇస్తే పార్టీలో ఎలాంటి స్పందన ఉంటుందనేది మరో చర్చగా మారింది. పోటీకి బ్రాహ్మణి అంగీకరిస్తారా లేదా అనేది అన్నింటి కంటే కీలకమైన అంశం. బ్రాహ్మణి అంగీకరిస్తే..పోటీ, సీటు పైన చంద్రబాబు తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు.