కాశ్మీర్ లో ముగిసిన పోలింగ్..! 58.19 శాతం పోలింగ్ నమోదు..

పదేళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీకి జరిగిన తొలి దశ పోలింగ్‌లో రికార్డు స్థాయిలో ఓటింగ్ జరిగింది. మొత్తం 90 స్థానాలకు గానూ తొలిదశలో బుధవారం 24 సీట్లకు జరిగిన పోలింగ్‌లో సాయంత్రం 5 గంటల సమయానికి 58.19 శాతం ఓటింగ్ జరిగింది. ఈ దశలో మొత్తం 219 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, 23.27 లక్షల ఓటర్ల కోసం 3,276 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. బుధవారం ఓటేసేవారిలో 1.23 లక్షల మంది తొలిసారి ఓటుహక్కును నమోదుచేసుకున్న వారే కావటం విశేషం. సాయంత్రం ఆరుగంటల సమయానికీ ఇంకా కొన్నిచోట్ల ఓటర్లు క్యూ లైన్లలో ఓటు వేసేందుకు వేచి ఉండటంతో పోలింగ్ మరింత పెరిగే అవకాశం ఉంది.

 

తరలివచ్చిన ఓటర్లు..

ఎన్నికల్ని బహిష్కరించాలనే వేర్పాటువాద శక్తుల ప్రచారాలు, పోలింగ్‌ ప్రక్రియను భగ్నం చేయడమే లక్ష్యంగా ముష్కరులు చేసే దాడులు, అంతులేని రిగ్గింగ్ లాంటివేమీ లేకపోవటంతో ఈసారి ఎన్నికల్లో ఓటువేసేందుకు అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహంగా ముందుకొచ్చారు. బుధవారం ఉదయం ఏడు గంటల నుంచే క్యూ లైన్లలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కిష్త్వార్‌ జిల్లాలో అత్యధికంగా 77.23% ఓటింగ్ జరగగా, పుల్వామా జిల్లాలో అత్యల్పంగా 43.87% పోలింగ్ జరిగింది. ఆర్టికల్ 370ని తొలగించిన తర్వాత ఇక్కడ జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవే కావటంతో దేశవ్యాప్తంగా వీటిపై ఆసక్తి నెలకొంది. బుధవారం నాటి తొలి దశ ఓటింగ్‌లో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నివసిస్తున్న 35 వేల మందికి పైగా కశ్మీరీ పండిట్‌లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

 

నేడు ప్రధాని ప్రచారం..

కాగా, రెండవ దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ గురువారం జమ్మూ కశ్మీర్‌లో పర్యటించనున్నారు. శ్రీనగర్‌లోని షేర్-ఎ-కశ్మీర్ స్టేడియంలో గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు. సెప్టెంబరు 25న రెండవ దశ పోలింగ్ జరగనుంది. 2024 మే నెలలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇక్కడ ఊహించని రీతిలో 58 శాతం పోలింగ్ నమోదు కాగా, ఆ ఎన్నికల్లో బీజేపీ 24.36 శాతం, నేషనల్ కాన్ఫరెన్స్ 22.3 శాతం, కాంగ్రెస్ 19.38 శాతం, పీడీపీ 8.48 శాతం ఓట్లు సాధించిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *