‘డీప్ స్పేస్’లో నాసా బిల్డర్ రోబోలు..!

డీప్ స్పేస్ మిషన్లలో భారీ నిర్మాణాల విషయంలో నాసా కీలక ముందడుగు వేసింది. ఇందుకోసం ప్రత్యేకించి అటానమస్ కనస్ట్రక్షన్ సిస్టమ్‌ను రూపొందించింది. నాసాకు చెందిన ఆటోమేటెడ్ రీకాన్ఫిగరబుల్ మిషన్ అడాప్టివ్ డిజిటల్ అసెంబ్లీ సిస్టమ్స్(ARMADAS-అమాడాస్) ప్రాజెక్టు బృందం ఈ దిశగా పరిశోధనలు చేస్తోంది.

 

రోబోలు, స్ట్రక్చరల్ బిల్డింగ్ బ్లాకులు, స్మార్ట్ అల్గారిథమ్స్‌తో కూడి ఉంటుందీ అటానమస్ కనస్ట్రక్షన్ సిస్టమ్‌. అంతరిక్ష పరిశోధనల్లో భాగంగా భారీ ఎత్తున సోలార్ పవర్, కమ్యూనికేషన్ల వ్యవస్థలతో పాటు ఆస్ట్రోనాట్ల కోసం ఆవాసాలను నిర్మించాల్సి ఉంటుంది. భూమి నుంచి ప్రీ-అసెంబుల్డ్ హార్డ్‌వేర్‌ను తీసుకెళ్లి.. భారీ నిర్మాణాలను చేపట్టడం సంక్లిష్టమైన పని. దీనికి ప్రత్యామ్నాయ విధానాలను అభివృద్ధి చేయడంపై అమాడాస్ టీం దృష్టి పెట్టింది.

 

చంద్రుడు, అంగారక గ్రహాలపైకి.. వీలైతే రోదసిలో ఇంకా సుదూర ప్రాంతంలో సుదీర్ఘకాలం పరిశోధనలు చేయాల్సిన రోజులు వస్తాయని నాసా భావిస్తోంది. ఇందుకు మౌలిక సదుపాయాలను, భారీ నిర్మాణాలను ఎన్నింటినో కల్పించాల్సి ఉంటుంది. తమంత తాముగా నిర్మాణం చేపట్టగల, వాటిని నిర్వహించగల వ్యవస్థలు ఉంటేనే ఇది సాధ్యం. ఆవాసాల నిర్మాణం, భారీ యాంటెన్నాల అమరిక, స్పేస్‌పోర్ట్ నిర్మాణం వంటివి చేపట్టడానికి అమాడాస్ బృందం బిల్డర్ రోబోలను అభివృద్ధి చేసింది.

 

ఆ రోబోల పనితీరును ఇటీవల ఏమిస్ రిసెర్చ్ సెంటర్‌లో నాసా పరీక్షించింది. అవి చూడటానికి ఇంచ్‌వార్మ్ (inchworm)తరహాలో ఉంటాయి. గొంగళిపురుగు, ఇంచ్‌వార్మ్ ఒకే జాతికి చెందినవి. కాకపోతే గొంగళిపురుగుకి వరుసగా కాళ్లు ఉంటే.. ఇంచ్‌వార్మ్‌కి ముందు, వెనుక మాత్రమే ఉంటాయి. మధ్య భాగం మొత్తం శరీరమే. శరీరాన్ని పైకి లేపుతూ.. ముందు కాళ్ల వద్దకు వెనుక కాళ్లను చేర్చడం ద్వారా అది నిదానంగా కదులుతుంటుంది.

 

ఇంచ్‌వార్మ్ తరహాలో ఉండే బిల్డర్ రోబోల పనితీరు పట్ల నాసా శాస్త్రవేత్తలు సంతృప్తి వ్యక్తం చేశారు. వందలాది బిల్డింగ్ బ్లాక్‌లతో ఆ రోబోలు షెడ్డు‌ను నిర్మించాయి. బ్లాక్‌ల అమరికలో వాటి పనితీరు దివ్యంగా ఉందని అమాడాస్ చీఫ్ ఇంజనీర్ క్రిస్టిన్ గ్రెగ్ చెప్పారు. ఈ తరహా సాంకేతికతను రోదసికి చేర్చడంలో తాజా ప్రయోగం ఎంతో కీలకంగా మారిందన్నారు.

 

వేల సంఖ్యలో పిక్సెల్స్‌తో ఓ డిజిటల్ చిత్రానికి రూపు ఇచ్చిన విధంగానే 3-డీ బిల్డింగ్ బ్లాక్స్‌ను ఉపయోగించి విభిన్న నిర్మాణాలను చేపట్టడం ఈ విధానం ప్రత్యేకత అని వివరించారు. వాక్సెల్(voxel-VOlume piXEL)‌గా వ్యవహరించే 3-డీ బిల్డింగ్ బ్లాక్స్‌ను కాంపోజిట్ మెటీరియల్స్‌తో తయారు చేస్తారు. ఇవి తేలికగా ఉంటాయి. అదే సమయంలో ఎంతో దృఢత్వమూ ఉంటుంది. బిల్డర్ రోబోలతో పూర్తయిన నిర్మాణాల సేఫ్టీని తనిఖీ చేసేందుకు ఇన్‌స్పెక్షన్ టూల్స్‌ను సైతం అమాడాస్ టీం అభివృద్ధి చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *