ఇరవై నాలుగ్గంటల వ్యవధిలో వెలువడిన రెండు తీర్పులు……

Related image
న్యాయవ్యవస్థమీద నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంపొందించేలా ఉన్నాయి. అభం, శుభం తెలియని ఎనిమిది సంవత్సరాల పసిపాపపై కథువాలో జరిగిన అమానుష అత్యాచారం, హత్యాకాండ సంఘటనలో దిగువ కోర్టు, సామాజిక మాధ్యమాల్లో ఉంచిన వీడియోను సాకుగా చూపి ఒక పాత్రికేయుడిని అరెస్ట్‌ చేసిన కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం స్పందించిన తీరు న్యాయ వ్యవస్థ పట్ల విశ్వాసాన్ని నిలబెట్టేలా ఉన్నాయి. అత్యాచారం, హత్య కేసులో నిందితులకు యావజ్జీవశిక్షను దిగువ కోర్టు విధించింది. జర్నలిస్టు ఉంచిన వీడియోను సాకుగా చూపుతూ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆదేశానుసారం పాత్రికేయుని అరెస్ట్‌ను సమర్ధించుకున్న పోలీసుల వాదనను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు ఆయన్ను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. రెండవసారి ఎన్నికల్లో గెలుపొందిన తరువాత దేశ వ్యాప్తంగా బిజెపి శ్రేణులు అనేక ప్రాంతాల్లో చెలరేగిపోయినట్టు, మూక దాడులకు దిగినట్టు వార్తలు వచ్చాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన పాత్రికేయుడు ప్రశాంత్‌ కనోజియాపై సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వం చేసిన దాడిని కూడా ఇలాగే పరిగణించాలి. ట్విట్టర్‌ ఖాతాలో ఆయన పోస్ట్‌ చేసిన ఒక వీడియో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని ఆరోపించిన పోలీసులు ఆయన్ను అరెస్ట్‌ చేశారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో ఒకదానితో ఒకటి ఏ మాత్రం సంబంధం లేని సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి 11 రోజుల పాటు నిర్బంధించారు. నిబంధనలకు వ్యతిరేకంగా రాష్ట్ర సరిహద్దులు దాటించారు. ఇవన్నీ రాజ్యాంగ విరుద్ధ చర్యలే ..మమ్మల్ని విమర్శిస్తే అంతుచూస్తామన్న హెచ్చరికలే! అందుకే ప్రశాంత్‌ కనోజియా అరెస్ట్‌ను భావప్రకటన స్వేచ్ఛపై చేసిన దాడిగా పలువురు అభివర్ణించారు. బెయిల్‌ పిటిషన్‌ను విచారించిన ఇందిరాబెనర్జీ, అజరు రస్తోగి నేతృత్వంలోని ధర్మాసనం కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ట్వీట్‌లో పేర్కొన్న అభిప్రాయాలతో ఏకీభవించమని చెబుతూనే వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగితే చేతులు కట్టుకుని చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేసింది. 
పౌరుల ప్రాథమిక హక్కులే లక్ష్యంగా విధ్వంస మూక చెలరేగుతున్న సమయంలో అత్యున్నత న్యాయస్థానం తీసుకున్న ఈ వైఖరి ఎంతగానో ఆహ్వానించదగినది. 

కథువా నిందితుల్లో ముగ్గురికి జీవిత ఖైదు, మరో ముగ్గురికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ పఠాన్‌కోట్‌ లోని జిల్లా సెషన్స్‌ కోర్టు ఇచ్చిన తీర్పుకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. అభం,శుభం తెలియని చిన్నారిపై జరిగిన అమానుష కాండను కుల, మతాలతో సంబంధం లేకుండా ఖండించడానికి బదులుగా బిజెపి నేతలు నిందితులకు బాహాటంగా మద్దతు తెలపడానికి కారణం బహిరంగ రహస్యమే! హిందూ ఏక్తా మంచ్‌గా ఏర్పాటైన వీరు సాక్ష్యాధారాలు రూపుమాపడానికి ప్రయత్నించారు. అధికారం అండతో నిందితులకు అవసరమైన అన్ని రకాల సహాయం చేశారు. సంచార తెగకు చెందిన బాలిక ఎదర్కొన్న కష్టానికి, పోయిన ప్రాణానికి ఏ మాత్రం విలువ లేనట్టుగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఈ అమానుష కాండకు కారకులైన వారిలో కొందరికైనా జీవితశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇవ్వడం బాధితులకు ఆపన్నహస్తం అందించడమే. ఇంకా కఠినశిక్ష పడలేదన్న అంసతృప్తిని కొందరు వ్యక్తం చేస్తున్నా, అక్కడ నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్లో కోర్టులో నేరం రుజువై, శిక్షపడటమే పెద్ద విజయం. 

విడివిడిగా చూస్తే ఈ రెండు కేసులు వేరువేరుగా, ఒకదానితో ఒకటి సంబంధం లేనివిగా కనిపిస్తాయి. కానీ, వీటి నేపథ్యం హిందుత్వ విషోన్మాదం. రాజ్యాంగ హక్కుల విధ్వంసం! అందుకే, ఈ తీర్పుల్లోని అంశాలే కాదు, వాటిని కోర్టులు వెలువరించిన సమయం కూడా కీలకమైనదే. సాధారణ ఎన్నికల్లో నరేంద్రమోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం గతం కన్నా ఎక్కువ మెజార్టీతో అధికారంలోకి రావడంతో దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్న ఉన్మాద శక్తులకు ఈ తీర్పులు చెంపపెట్టు. అభ్యుదయ, ప్రజాతంత్ర శక్తులకు కొంతమేరకు ఊరటనిస్తాయి. నరేంద్రమోడీ ఆయన అంతేవాసులు బ్యాలెట్‌ పోరులో గెలిచివుండవచ్చు. కానీ భావజాల యద్ధంలో కాదంటూ ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్‌ చేసిన వ్యాఖ్య ఈ సందర్భంగా గమనార్హం. దేశ వ్యాప్తంగా జరిగిన సాధారణ ఎన్నికల్లో బిజెపికి 38 శాతం ఓట్లు మాత్రమే లభించాయన్న వాస్తవాన్ని విస్మరించకూడదు. దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో ఆ పార్టీ ఖాతా తెరవనేలేదు. గెలిచిన చోట కూడా తిమ్మిని బమ్మిని చేసే టక్కుటమార విద్యలు, మీడియా సహాయంతో దట్టించి వదిలిన కుహనా జాతీయవాద ప్రభావమే ఎక్కువ! అందుకే, న్యాయస్థానాలు చూపిన ఈ చొరవను, ప్రదర్శించిన స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్ళాల్సిన బాధ్యత అభ్యుదయ, ప్రజాతంత్ర శక్తులపై ఉంది. న్యాయవ్యవస్థ స్వతంత్రతను కొనసాగించే వాతావరణాన్ని మరింత పటిష్టంగా నిలుపుకోవడం అవసరం. ఈ దిశలో ప్రజలను చైతన్యం చేయాలి. అటువంటి చొరవే భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *