రైతు భరోసా నిధుల జమ పై బిగ్ అప్డేట్..

ఏపీ ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల అమలు పైన ఫోకస్ చేసింది. అధికారికంగా హామీల అమలు క్యాలెండర్ ప్రకటనకు సిద్దం అవుతోంది. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభించాలని నిర్ణయించారు. అమ్మకు వందనం పైనా చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో రైతులకు ఇచ్చిన హమీ మేరకు అన్నదాత సుఖీభవ పథకం అమలు విషయంలో ప్రభుత్వం తాజాగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

 

అధికారుల కసరత్తు

కూటమి నేతలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో అన్నదాత సుఖీభవ ప్రధానమైనది. వైసీపీ ప్రభుత్వ హాయంలో అమలు చేసిన రైతు భరోసా పథకాన్ని అన్నదాత సుఖీభవ పేరుతో అమలు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద నిధుల విడుదల ఎప్పుడు చేసే అవకాశం ఉంటుందనే దాని పైన ప్రభుత్వంలో చర్చ మొదలైంది. ఆర్దిక శాఖ కసరత్తు తరువాత ప్రస్తుత సంవత్సరంలో ఈ పథకం అమలు సాధ్యపడదనే అంశం స్పష్టం అవుతోంది. వచ్చే ఆర్దిక సంవత్సరంలోనే ఈ పథకం అమలు కానుందని సమాచారం.

 

ఈ ఏడాది లేనట్లే

2024-25 పూర్తి స్థాయి బడ్జెట్‌ను నవంబర్‌లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ఈ బడ్జెట్ లో అన్నదాత సుఖీభవ పథకం కోసం నిధులను ప్రస్తావన చేయకుండా.. పథకం హామీ పైనే మరోసారి స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఉచిత గ్యాస్‌ సిలిండర్లు, విద్యార్థుల ఫీజులకు ‘తల్లికి వందనం’, నిరుద్యోగ భృతి వంటి హామీల అమలుపై దృష్టి పెట్టిన ప్రభుత్వం, రైతులకు ఆర్థిక సాయం అందించే అన్నదాత సుఖీభవను మాత్రం వచ్చే ఆర్దిక సంవత్సరంలో అమలు చేసేలా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజా వరదల్లో పంటలు నష్టపోయిన రైతుల్లో కొందరికే ఇన్‌పుట్‌ సబ్సిడీ అందింది. బీమా పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.

 

అమలులో కోత

రైతులకు, కౌలు రైతులకు ఏటా రూ.20 వేల ఆర్థిక సాయం చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు రైతులు ఈ పథకం నిధులు రబీలో ఇస్తారా, జనవరిలో సంక్రాంతి కి ఇస్తారా అనే ఆశతో ఉన్నారు. కానీ, ఇప్పుడు ప్రభుత్వం వచ్చే ఆర్దిక సంవత్సరంలో తొలి నెలలో ఏప్రిల్ లో విడుదల చేసే ఆలోచనతో ఉందని తెలుస్తోంది.అదే జరిగితే ఒక ఏడాది సాయం రూ.20 వేలను రైతులు, కౌలు రైతులు కోల్పోతారు. పీఎం కిసాన్ నిధుల ఖాతా దారుల సంఖ్యలోనూ కోత పడింది. రాష్ట్రంలో 76 లక్షల మంది సొంత భూమి కలిగిన రైతులు, కౌలు రైతులు 8-10 లక్షల మంది ఉన్నారని ప్రభుత్వ లెక్కలే చెబుతు న్నాయి. పలు నిబంధనలతో లబ్ధిదారుల సంఖ్య 41 లక్షలకు తగ్గిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *