గ్రూప్ 1 అభ్యర్థులపై పోలీసుల లాఠీచార్జ్.. బండి సంజయ్ ఆగ్రహం..

తెలంగాణ గ్రూప్‌-1 పరీక్ష రీ షెడ్యూల్‌ చేయాలని కోరుతూ అశోక్‌నగర్‌లో ఆందోళనకు దిగిన అభ్యర్థులపై పోలీసులు లాఠీ ఛార్జీ చేయడంపై కేంద్రమంత్రి బండి సంజయ్ సీరియస్ అయ్యారు. న్యాయం కోసం నిరసన తెలిపితే కొడతారా? అని మండిపడ్డారు. కరీంనగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు. అశోక్‌నగర్‌లో గ్రూప్ 1 అభ్యర్థులను కలిసి వారికి మద్దతు తెలుపుతానని చెప్పారు.

 

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 29 కారణంగా గ్రూప్ 1 అభ్యర్థులకు నష్టం జరుగుతుందన్నారు. ఇది ప్రభుత్వ అనాలోచిత నిర్ణయమేనని బండి సంజయ్ విమర్శించారు. న్యాయం కోసం ఆందోళన చేస్తున్న అభ్యర్థులపై లాఠీచార్జ్ చేస్తున్నారని మండిపడ్డారు. 15 వేల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చి.. 60 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటున్నారని ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి, నేటి కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా లేదని బండి సంజయ్ విమర్శించారు.

 

కేసీఆర్ అనాలోచిత విధానాలకు అనుగుణంగానే ఈ ప్రభుత్వం నడుస్తోందన్నారు. ఈ ప్రభుత్వానికి ఉద్యోగాలు భర్తీ చేసే ఆలోచన లేదన్నారు. ప్రణాళిక ప్రకారమే జీవో 29 ఇచ్చారని ఆరోపించారు. నిరుద్యోగుల ఉసురు తగిలే బీఆర్ఎస్ ఓడిపోయిందన్న బండి సంజయ్.. నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత ఆ పార్టీకి లేదన్నారు. ప్రశ్నపత్రాలు లీకేజీ చేసి నిరుద్యోగుల భవిష్యత్ ను బీఆర్ఎస్ నాశనం చేసిందని బండి సంజయ్ ధ్వజమెత్తారు.

 

ఆందోళన చేస్తున్న గ్రూప్-1 అభ్యర్థులపై పోలీసుల లాఠీఛార్జ్

 

అక్టోబర్ 21 నుంచి జరిగే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ రోడ్లపైకి చేరుకున్నారు. ప్లకార్డులతో రోడ్లపైకి వచ్చిన 16 మందిని పోలీసులు అరెస్టు చేసి బేగంబజార్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు లాఠీ ఛార్జి చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. వందల సంఖ్యలో నిరసన చేపట్టిన అభ్యర్ధులు.. గతంలో జరిగిన ప్రిలిమ్స్ పరీక్షల్లో తప్పులు, జీవో 29 సవరించిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అశోక్ నగర్ లో పోలీసులు భారీగా మోహరించారు. శుక్రవారం రాత్రి ఈ ప్రాంతంలోని కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా నిలిపిివేయడం గమనార్హం.

 

కాగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభ్యర్థులపై లాఠీఛార్జీని ఖండించారు. గ్రూప్ -1 అభ్యర్థులకు తమ పార్టీ అండగా ఉంటుందని ప్రకటించారు. మరోవైపు, అక్టోబర్ 21 నుంచి నిర్వహించనున్న గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలకు లైన్ క్లియర్ అయ్యింది. గ్రూప్‌-1 పరీక్షలపై దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. సింగిల్‌ బెంచ్‌ తీర్పును హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ సమర్థించింది. దీంతో షెడ్యూల్‌ ప్రకారమే ఈనెల 21 గ్రూప్‌-1 పరీక్షలు జరగనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *