మాల్దీవ్స్ తో దుష్మనీ..

భారత్‌కు మాల్దీవ్స్‌కు మధ్య దూరం ఎందుకు పెరుగుతోంది? దీనికి ఎవరు బాధ్యులు? మాల్దీవ్స్‌తో దుష్మనీ మనకు లాభమా? నష్టమా? ఉన్నపళంగా టూరిస్ట్‌లంతా మాల్దీవ్స్‌ను మరిచి లక్షద్వీప్‌కు క్యూ కట్టే అవకాశాలు ఎంత?

 

భారత్‌కు మాల్దీవులు దూరంగా జరగడం అనుకున్నదే. మొన్నమొన్నటి వరకు మాల్దీవుల్లో భారత్‌కు అనుకూలంగా ఉన్న ప్రభుత్వం ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయి.. భారత వ్యతిరేక కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే ఈ ఎన్నికల్లో గెలిచిన మహమ్మద్ ముయిజ్జూకు చైనా అనుకూల వాది అన్న పేరుంది. ఆయన పాలన పగ్గాలు చేపట్టగానే మాల్దీవుల్లో ఉన్న భారత సైనికులు వెనక్కి వెళ్లిపోవాలని ఆదేశించారు. ఎన్నికల ప్రచారంలోనే ఆయన ఇండియా ఔట్ నినాదాన్ని ఇచ్చారు. మొదటి నుంచి భారత సైన్యాన్ని వెనక్కి పిలిపించాలని చెబుతున్న మహమ్మద్ ముయిజ్జూ.. అధికారం చేపట్టిన వెంటనే చర్యలు తీసుకున్నారు.

 

హిందూ మహా సముద్రం ప్రాంతంలో వ్యూహాత్మకంగా పట్టు సాధించడం కోసం మాల్దీవుల్లో తమ ఉనికిని పెంచుకోవడానికి గత కొంత కాలంగా భారత్, చైనా దేశాలు విపరీతంగా పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గతంలో మాల్దీవుల అధ్యక్షుడిగా ఉన్న ఇబ్రహీం సోలిహ్ ఇండియా ఫస్ట్ నినాదంతో భారత్‌తో మెరుగైన సంబంధాలు కొనసాగించగా.. ఆయన తాజాగా జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇక చైనా అనుకూల వ్యక్తి అయిన మహమ్మద్ మొయిజ్జూ భారత్ ఔట్ నినాదంతో ఎన్నికల్లో గెలవడం భారత్‌కు పెద్ద ఎదురు దెబ్బగా మారింది.

 

మాల్దీవులకు భారత్ రెండు హెలికాప్టర్లు, ఒక చిన్న విమానాన్ని అందించింది. మాల్దీవుల్లో సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్లు, మెడికల్ సేవలు అందించేందుకు ఈ హెలికాప్టర్లు, విమానాన్ని ఇచ్చింది. వీటిని కూడా వెనక్కి ఇచ్చేయాలని నిర్ణయించింది మాల్దీవులు. అయితే మాల్దీవుల ఆర్థిక వ్యవస్థను పెంపొందించేందుకు 2018 లో మాల్దీవులకు 1.4 బిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీని భారత్ అందించింది. ఆ తర్వాత 2020 లో మాలేను పొరుగు ద్వీపాలకు అనుసంధానించే వంతెనలు, కాజ్‌వేలను నిర్మించడానికి 500 మిలియన్ డాలర్లు అంటే 4 వేల కోట్లను అందించింది.

 

కానీ ఈ సహాయాన్ని అక్కడి దేశం మర్చిపోయింది. భారత్‌కు వ్యతిరేకంగానే అడుగులు వేస్తోంది. ఈ విషయాలన్నింటిని గమనిస్తూనే ఉంది భారత్. అందుకే మాల్దీవ్స్‌ ఆయువు పట్టైన పర్యాటకం మీద తేలీకుండానే ప్రభావం పడేలా లక్షద్వీప్‌ను వ్యూహాత్మకంగా తెరపైకి తీసుకొచ్చింది. నిజానికి లక్షద్వీప్‌ అందాలు పర్యాటకుల మనసు ఆకట్టుకుంటాయి. అద్భుతమైన పగడపు దిబ్బలు, శుభ్రమైన బీచ్‌లు టూరిస్టులకు కొత్త అనుభూతిని ఇస్తాయి. ఎటు చూసినా ఆశ్చర్యానికి గురి చేసే అందాలే కనువిందు చేస్తాయి. లక్షద్వీప్‌లో మొత్తం 36 ద్వీపాలున్నాయి. 1956లో ఈ దీవులని కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించారు. 1973లో లక్షద్వీప్ అనే పేరు పెట్టారు. ఇక్కడ 36 ద్వీపాలున్నా పదింటిలోనే ప్రజలు నివసిస్తారు. మరో ప్రత్యేకత ఏమిటంటే.. దేశంలోని అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం.

 

కానీ లక్షద్వీప్‌లో మాల్దీవ్స్‌లో ఉన్నన్ని సదుపాయాలు ప్రస్తుతానికైతే లేవనే చెప్పాలి. అక్కడికి చేరకోవడమే ఓ సమస్యగా ఉంది. మన దేశంలో అంతర్భాగమైనా అక్కడికి చేరుకోవాలంటే పోలీస్‌ వేరిఫికేషన్‌ తప్పనిసరి. షిప్‌ ద్వారా అయితే రెండు రోజుల సమయం పడుతుంది. లక్షద్వీప్‌లో ఒకే ఒక్క ఎయిర్‌పోర్ట్ ఉంది. ఇక్కడికి కేవలం కొచ్చిన్ నుంచి మాత్రమే విమాన సర్వీసులు నడుస్తున్నాయి. అది కూడా రోజుకు కేవలం ఒకటి లేదా రెండు మాత్రమే ఉన్నాయి. అయితే లక్షద్వీప్‌లో పర్యాటకాన్ని పెంపొందించాలని కేంద్రం ఇప్పటికే డిసైడ్ అయ్యింది. దీనికి తగ్గట్టుగానే భవిష్యత్తులో పర్యాటకం ఊపందుకోవడం ఖాయమే. కానీ ఇప్పటికిప్పుడు మాల్దీవులకు జరిగే నష్టం అంత ఎక్కువగా ఉండకపోవచ్చని తెలుస్తోంది.

 

అదే సమయంలో ఈ అంశం భారత్, మాల్దీవుల మధ్య దూరాన్ని మరింత పెంచే అవకాశం ఉంది. వ్యూహాత్మకంగా మాల్దీవులు మనకు అత్యంత అవసరమైన దేశం. కయ్యానికి కాలుదువ్వేందుకు ఎల్లప్పుడూ రెడీగా ఉండే డ్రాగన్ కంట్రీ చైనా కంట్రోల్‌లోకి మాల్దీవులు వెళితే మన భద్రతకు పెద్ద సమస్యే. మాల్దీవుల్లో చైనా సైన్యం పాగా వేస్తే మన కదలికలను తెలుసుకునే ప్రమాదం ఉంది. అందుకే.. మాల్దీవులతో పూర్తి స్థాయిలో వైరం మనకు ఏమాత్రం మంచిది కాదు. అంతేకాదు, ఇప్పటికే చుట్టుపక్కల దేశాలతో మనకు సరైన సత్సంబంధాలు లేవు. మాల్దీవులు కూాడా ఆ గ్రూప్‌లో చేరిపోతే మన చుట్టూ శత్రువులు పెరిగిపోతారు. మనపై దాడులకు ఆ దేశాల నుంచే కుట్రలను అమలు చేస్తుంటారు. అందుకే.. మాల్దీవులను మళ్లీ మనవైపు తిప్పుకోవడమే కాదు, చైనాకు దగ్గర కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా మన ప్రభుత్వం పై ఉంది. #boyc

ottmaldives

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *