YS షర్మిల.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఓ బ్రాండ్. ప్రస్తుతం ఈమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇవాళో.. రేపో.. ఏపీలో హస్తం పార్టీ పగ్గాలు చేపడతారనే వార్తలూ వినిపిస్తున్నాయి. షర్మిలకు PCC పగ్గాలు ఇచ్చినా.. లేక ప్రచార బాధ్యతలు ఇచ్చినా.. ఆ ప్రభావం ఎవరిపై పడుతుందనే విషయం ఉత్కంఠగా మారింది. జగనన్న వదిలిన బాణంగా ఎదిగిన ఆమె.. తిరిగి తిరిగి అన్నపైనే బాణం ఎక్కుపెడుతుందా లేక ప్రతిపక్షాల ఓట్లు చీలుస్తుందా.
ఏపీ కాంగ్రెస్‌లోకి వైఎస్ షర్మిల రాకతో ఆ పార్టీ క్యాడర్ ఆశలు పెంచుకుంది. షర్మిలకు త్వరలోనే APPCC బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం సాగుతోంది. ఆమె రాకతో కాంగ్రెస్ పార్టీ బలోపేతం మాటెలా ఉన్నా.. YCP మాత్రం అయోమయంలో పడింది. గత ఎన్నికల్లో వైసీపీ తరుపున ప్రచారం చేసిన షర్మిల.. జగనన్న వదిలిన బాణంగా పేరు తెచ్చుకున్నారు. గత ఎన్నికలకు ముందు అన్న జైలుకు వెళ్లిన సమయంలో.. స్వయంగా ప్రచార బాధ్యతలు చేపట్టి.. రాజన్న కూతురుగా జనంలోకి వెళ్లారు. ఓ రకంగా.. వైసీపీ విజయంలో షర్మిల కూడా కీలకంగా వ్యవహరించారనేది ఓపెన్ సీక్రెట్. కానీ అధికారం చేపట్టాక చెల్లెలిని అన్న జగన్ దూరం పెట్టడంతో.. ఆ బాణం ఇప్పుడు ఆయనపైకే వెళ్లబోతోంది.
కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత.. షర్మిల సేవలను పార్టీ ఏ విధంగా ఉపయోగించుకోనుందనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది. ఆమెకు పీసీసీ అధ్యక్ష బాధ్యతలు కట్టబెడతారా.. లేక ప్రచార బాధ్యతలు అప్పగిస్తారనే అనేది చర్చనీయాశంగా మారింది. రెండింటిలో ఏది జరిగినా.. ఆ ప్రభావం తమపై పడుతుందని వైసీపీ అధిష్టానం ఆలోచనలో పడింది. పైకి.. తమకు ఎలాంటి నష్టం లేదని చెబుతున్నా.. లోలోపల మాత్రం.. కచ్చితంగా ప్రభావం ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే.. ఆమె కాంగ్రెస్ లో చేరక మునిపే.. కొందరు వైసీపీ నేతలు.. షర్మిలను బుజ్జిగించినట్లు కూడా వార్తలు వినిపించాయి. తీరా షర్మిల కాంగ్రెస్ గూటికి చేరాక.. తమకు ఏమాత్రం నష్టం కాదని..అసలు ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఒకశాతం ఓటింగ్ కూడా లేదని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
ఏపీలో కాంగ్రెస్‌కు పునర్ వైభవం తీసుకొచ్చేలా ఆ పార్టీ అధిష్టానం ప్రణాళికలు రచిస్తోంది. మరోవైపు.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చుకుండా చూడాలని టీడీపీ, జనసేన చూస్తున్నాయి. ఇలాంటి క్రమంలో షర్మిల రాక.. వైసీపీపై ప్రభావం చూపుతుందనేది రాజకీయ విశ్లేషకుల మాట. వాస్తవంగా చూస్తే.. ప్రస్తుతం వైసీపీలో ఉన్న నేతలంతా..ఒకప్పటి కాంగ్రెస్ పార్టీలో వారే. విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ.. ఏపీలో ఉనికి కోల్పోవడం సహా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తనయుడిగా జగన్ మరింత ఎస్టాబ్లిస్ కావటంతో.. వారంతా వైసీపీ గూటికి చేశారు. తర్వాత కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతైంది. కర్ణాటకలో హస్తం పార్టీ గెలవటం..తర్వాత తెలంగాణలోనూ విజయకేతనం ఎగురవేయటంతో.. ఏపీలోనూ పార్టీని బలోపేతం చేయాలని అధిష్టానం పావులు కదుపుతోంది. ఏపీలో కాంగ్రెస్ అంటే ఠక్కున గుర్తొచ్చే రాజశేఖర్‌రెడ్డే కాబట్టి.. పోయిన వైభవాన్ని ఆయన కుమార్తె ద్వారానే తిరిగి పొందాలని చూస్తోంది.
ఎన్నికల ముందు వైసీపీలో అసంతృప్తి వరుసగా బయటపడుతోంది. ఈ తరుణంలో షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపడితే.. ఆమె వెంట నడిచేందుకు పలువురు నేతలు సిద్ధమవుతున్నారు . ఇప్పటికే వైసీపీకి ఇటీవల రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిలతోనే తన రాజకీయ ప్రయాణమంటూ ప్రకటించారు. ఏపీ కాంగ్రెస్ నేతలు కూడా షర్మిలకు బాధ్యతలు అప్పగిస్తే.. చేరికలు పెరుగుతాయని ఆశిస్తున్నారు. ఏపీ పీసీసీ చీఫ్ రుద్రరాజు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు, మాజీలు, ఎమ్మెల్సీలు టచ్ లో ఉన్నారని వ్యాఖ్యలు చేశారు. షర్మిల కాంగ్రెస్ లో చేరితే వైసీపీలో కాంగ్రెస్ వాదులంతా తిరిగి సొంత గూటికి చేరతారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
వైసీపీలో అసంతృప్తులంతా కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆ ప్రభావం వైసీపీపై పడుతుంది అనటంతో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. దానిపై వైసీపీ నేతలు బహిరంగంగా నోరు మెదపకపోయినా.. అంతర్గతంగా షర్మిల అంశంపై చర్చించుకుంటున్నారని సమాచారం. పైకి మాత్రం షర్మిల రాకతో తమకు ఇబ్బంది లేదనే చెబుతున్నారు. ఏపీలో అధికార వైసీపీ, టీడీపీ-జనసేన కూటమి వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం పోటీ పడుతున్నాయి. ఇటీవల బీజేపీ కూడా టీడీపీ, జనసేన కూటమిలో చేరుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో 2014 నాటి కాంబినేషన్ 2024 ఎన్నికల్లో రిపీట్ అవుతుందన్న ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో షర్మిల ఏపీ పాలిటిక్స్ లో ఎంట్రీ ఇస్తే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? అనే సమీకరణాలు మొదలయ్యాయి. షర్మిల రాకతో వైసీపీపైనే ఎక్కువ ప్రభావం పడుతోందని విశ్లేషకులు అంటున్నారు.
కాంగ్రెస్ సంప్రదాయ ఓటింగ్ వైసీపీ నుంచి కాంగ్రెస్ వైపు మళ్లే ఛాన్స్ లేకపోలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వంపై పలు సందర్భాల్లో పరోక్షంగా షర్మిల విమర్శలు చేశారు. ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపడితే షర్మిల..వైసీపీపై మరింత విరుచుకుపడతారని విశ్లేషకులు అంటున్నారు. జనసేన-టీడీపీ కూటమి కన్నా వైసీపీపైనే షర్మిల ఎఫెక్ట్ ఎక్కువ అని విశ్లేషకులు లెక్కలు వేస్తున్నారు. ఓట్ల చీలికతో టీడీపీ, జనసేన కూటమి లాభపడే అవకాశం ఉందని చెబుతున్నారు.
తనకు పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా శక్తివంచన లేకుండా నెరవేరుస్తానంటూ షర్మిల చెబుతున్నారు. రేపోమాపో ఆమెను ఏపీపీసీసీ అధ్యక్షురాలిగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించడం కూడా ఖాయంగానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలో తాను విభేదిస్తున్న అన్న పార్టీ వైఎస్సార్సీపీ నేతలు.. ఇప్పటికే ఆమెపై మాటల దాడి ప్రారంభించారు. వైసీపీలో అవకాశం లేకనే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టుకుందంటూ వైసీపీ ఉత్తరాంధ్ర వ్యవహారాల ఇన్ చార్జ్ వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి YSRTPని షర్మిల కాంగ్రెస్ లో విలీనం చేసిందని ఆయన అన్నారు. ఎవరు ఏ పార్టీ లో చేరినా అందరూ కలిసి పోటీచేసినా తమకు వచ్చిన నష్టం ఏమీ లేదన్నారు.
మరోవైపు.. వైసీపీ సర్కార్ లో సీనియర్ మంత్రి, సీఎం జగన్ సన్నిహితుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా షర్మిలపై కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిలే కాదు. కాంగ్రెస్ లో ఎవరు చేరినా రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తామన్నారు. వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసే వారిని ప్రతిపక్షంగానే చూస్తామని ఆయన తెలిపారు. చంద్రబాబు, సోనియా గాంధీ కుటుంబాలను కాదు. మనుషులను చీల్చే రాజకీయమంటూ మండిపడ్డారు. తద్వారా జగన్ కుటుంబాన్ని వీరు చీల్చారనే అర్ధం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. ఇదంతా.. షర్మిల రాక.. వైసీపీపై ప్రభావం చూపుతుందనే కోణంలోనే విమర్శలు సాగుతున్నాయనే వార్తలు గుప్పుమంటున్నాయి. చూడాలి.. షర్మిల రాకతో ఏపీలో కాంగ్రెస్ ఏ మేరకు బలపడుతుందో.. వచ్చే ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపుతుందో. ఆమె రాకతో అన్న జగన్‌కు నష్టం వాటిల్లుతుందా.. లేదా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చమంటూ భీష్మించుకున్న టీడీపీ-జనసేన మైత్రిపై పడుతుందా అనేది వేచి చూడాల్సిందే.