ఏపీని ఆవిష్కరణల కేంద్రంగా మార్చడంతో పాటు ఉన్నత విద్యను ఆధునీకీకరించే లక్ష్యంతో ప్రభుత్వం ఇవాళ రెండు కీలక ఒప్పందాలు చేసుకుంది. ఎడ్యుటెక్ ఫ్లాట్ ఫామ్ అయిన ఫిజిక్స్ వాలాతో పాటు టోనీబ్లెయిర్ ఇన్ స్టిట్యూట్ (టీబీఐ)తోనూ ఈ ఒప్పందాలు జరిగాయి. ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో అధికారులు ఆయా సంస్థల ప్రతినిధులతో ఈ ఒప్పందాలు చేసుకున్నారు.
ఫిజిక్స్ వాలా ఎడ్యుటెక్ సంస్థ తన పరిశ్రమ భాగస్వామి అయిన అమెజాన్ వెబ్ తో కలిసి రాష్ట్రంలో AI-ఫోకస్డ్ ఫస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ (IoE) యూనివర్సిటీ ఆఫ్ ఇన్నొవేషన్ (UoI)ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందం చేసుకుంది. మరోవైపు ఏపీలో ఉన్నత విద్యను ఆధునీకరించేందుకు టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ తో మరో ఒప్పందం కుదిరింది.
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయ్యే ఇన్నోవేషన్ విశ్వవిద్యాలయం అకడమిక్ ఎక్సలెన్స్, ఇన్నోవేషన్స్ ను ఏకీకృతం చేసే దిశగా పని చేయనుంది. అలాగే పరిశోధన, విద్య, ఉపాధిలో కీలక సవాళ్లను పరిష్కరించడంపై దృష్టిసారిస్తుంది. హబ్-అండ్-స్పోక్ మోడల్ ఆధారంగా ఇన్నోవేషన్ యూనివర్శిటీ సెంట్రల్ హబ్‌గా పనిచేస్తుంది. విభిన్న నేపథ్యాలు, ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు సమకాలీన, హైబ్రిడ్ విద్యను అందుబాటులోకి తెస్తారు. ఆన్‌లైన్, వ్యక్తిగత అభ్యసన అనుభవాలను ఇంటిగ్రేట్ చేస్తారు. మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ తో ఫిజిక్స్ వాలా కలిసి పనిచేస్తుంది.
కృత్రిమ మేధలో ఏపీ యువతను నెం.1గా తీర్చిదిద్దాలన్న సీఎం చంద్రబాబు ఆలోచనకు అనుగుణంగా ఈ ఒప్పందాలు జరిగాయని నారా లోకేష్ తెలిపారు. అధునాతన ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లడం, అందుకు ఏపీ యువతను సన్నద్దం చేయడమే తమ లక్ష్యమన్నారు. పరిశ్రమల డిమాండ్, ప్రమాణాలకు అనుగుణంగా స్కిల్ డెవలప్ మెంట్ పై యూనివర్సిటీ ఆఫ్ ఇన్నోవేషన్ దృష్టిసారిస్తుందని చెప్పారు. అధునాతన సాంకేతికత, విద్యను ఏకీకృతం చేయడానికి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ కృషిచేస్తుందన్నారు. ఫిజిక్స్ వాలా వ్యవస్థాపకుడు, సిఇఓ అలఖ్ పాండే ప్రభుత్వంతో తాము కుదుర్చుకున్న ఒప్పందం ఇన్నొవేషన్ విశ్వవిద్యాలయం స్థాపనలో తొలి అడుగన్నారు. ఇందుకు యుఎస్ జీఎస్పీ వెంచర్స్, ఇతర పెట్టుబడిదారుల ద్వారా రూ.1000 కోట్ల వరకు పెట్టుబడి పెడతామన్నారు.
మరోవైపు ఏపీలో ఉన్నత విద్యా వ్యవస్థను ఆధునీకరించేందుకు టోనీ బ్లెయిర్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ తో ప్రభుత్వం అవగాహన ఒప్పందంపై చేసుకుంది. ఈ కార్యక్రమంలో టిబిఐ కంట్రీ డైరక్టర్ వివేక్ అగర్వాల్, అసోసియేట్ ముంజులూరి రాగిణి రావు పాల్గొన్నారు. ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఏపీ విద్యార్థులను తీర్చిదిద్దడం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యమని వారు తెలిపారు. అంతర్జాతీయంగా విద్యావ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఎపి ఉన్నత విద్యలో చేయాల్సిన మార్పులపై టీబీఐ ప్రభుత్వానికి సలహాలు ఇవ్వనుంది.