ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL ప్రైవేట్ దిగ్గజాలు జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి పోటీ ఇస్తోంది. తక్కువ ధరల రీఛార్జ్ ప్లాన్లు, మెరుగైన కనెక్టివిటీతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న బీఎస్‌ఎన్‌ఎల్.. తాజాగా హర్యానా మొబైల్ మార్కెట్‌లో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. జూలై 2026లో జియో, ఎయిర్‌టెల్ కంటే ఎక్కువ మంది కొత్త మొబైల్ వినియోగదారులను తన నెట్‌వర్క్‌లో చేర్చుకుంది.
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) తాజా సబ్‌స్క్రిప్షన్ నివేదిక ప్రకారం.. జూన్ 2026 చివరి నాటికి హర్యానాలో BSNLకు 46,49,224 మంది మొబైల్ వినియోగదారులు ఉన్నారు. జూలై చివరి నాటికి ఈ సంఖ్య 47,17,784కు చేరింది. అంటే కేవలం ఒక్క నెలలోనే 68,560 మంది కొత్త వినియోగదారులు BSNL నెట్‌వర్క్‌లో చేరారు.
తక్కువ ధరల్లో అందుబాటులో ఉన్న రీఛార్జ్ ప్లాన్లు, నెట్‌వర్క్ కనెక్టివిటీ మెరుగుపడటం వంటి అంశాలు BSNLకు కలిసొస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రైవేట్ టెలికాం సంస్థల టారిఫ్‌లు పెరుగుతున్న సమయంలో BSNL అందిస్తున్న సరసమైన ప్లాన్లు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. దీంతో రానున్న రోజుల్లో మరిన్ని ప్రాంతాల్లో BSNL సబ్‌స్క్రైబర్ బేస్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.