తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి (Gruha lakshmi scheme) పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ పథకం స్థానంలో అభయహస్తం (Abhaya Hastham) పేరుతో రూ. 5 లక్షల ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
కొత్త పథకం నేపథ్యంలో గృహలక్ష్మిని రద్దు చేస్తున్నట్లు జీవో జారీ చేసింది కాంగ్రెస్ సర్కారు. లబ్ధిదారులకు కలెక్టర్లు ఇచ్చిన మంజూరు పత్రాలను కూడా రద్దు చేశారు. ఇంటి స్థలం ఉన్న పేదలకు.. గృహ నిర్మాణం కోసం రూ. 3 లక్షల ఆర్థిక సాయం చేసేందుకు గత ప్రభుత్వం గృహలక్ష్మి పేరుతో పథకాన్ని పెట్టిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుత ప్రభుత్వం దాని స్థానంలో అభయహస్తం పథకాన్ని అమలు చేస్తోంది.
telangana congress govt cancelled the gruha lakshmi scheme
నీతి ఆయోగ్ సభ్యులకు సీఎం రేవంత్ ప్రత్యేక వినతిః హైదరాబాద్‌ను కాలుష్య రహిత అర్బన్ గ్రోత్ హబ్గా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన సహకారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. నీతి ఆయోగ్బృందాన్ని కోరారు. భాగ్యనగరానికి వచ్చిన నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బేరీ, సభ్యుడు వీకే సారస్వత్తో సచివాలయంలో సీఎంతో సమావేశమయ్యారు.
చర్చించిన ముఖ్యాంశాలు: సహకార సమాఖ్యవాదం: సమర్థవంతమైన పాలనకు మార్గదర్శక సూత్రంగా కో-ఆపరేటివ్ ఫెడరలిజం ప్రాముఖ్యతను సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. నీతి ఆయోగ్, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఎదుర్కొంటున్న సవాళ్లు పరిష్కరించడానికి కలిసి పనిచేయడానికి అంగీకరించాయి.
అభివృద్ధి ప్రాధాన్యతలు: రాష్ట్రాభివృద్ధి, కీలక రంగాలకు సంబంధించి ప్రాధాన్యతలను, రాష్ట్ర అవసరాలను ముఖ్యమంత్రి నీతి ఆయోగ్ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దీనికి స్పందనగా నీతి ఆయోగ్ సభ్యులు రాష్ట్ర అభివృద్ధికి తమవంతుగా సహకారమందిస్తామన్నారు. వనరుల కేటాయింపు: కేంద్రం నుంచి అందవలసిన న్యాయమైన కేటాయింపులు, వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం రాష్ట్రానికిచ్చే నిధులు, వనరుల మంజూరు గురించి చర్చించారు.
ముఖ్యమంత్రి నీతి ఆయోగ్ దృష్టికి తీసుకొచ్చిన అంశాలు: • 16వ ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రానికి ఇచ్చే నిధుల కేటాయింపు పెరిగేలా చూడాలి. • ఆరోగ్యం, విద్యలో మౌలిక సదుపాయాల కోసం నిధులు కేటాయింపు. • ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని సెక్షన్ 94(2) ప్రకారం వెనుకబడిన జిల్లాల అభివృద్ధి గ్రాంట్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ.1800 కోట్ల నిధుల విడుదల గురించి చర్చించారు.
ఇన్నోవేషన్ మరియు బెస్ట్ ప్రాక్టీసెస్: వినూత్న పాలనా పద్ధతులు, విజయవంతమైన నమూనాలను పరస్పరం పంచుకోవాలని అంగీకారం. స్థానిక సమస్యలు పరిష్కరించడంలో మెరుగైన పద్ధతులను అవలంబించాలని నీతి ఆయోగ్ సూచించింది.
స్కిల్ డెవలప్‌మెంట్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్సెస్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి, రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో గ్రాడ్యుయేషన్ కోర్సులు అభ్యసిస్తున్న యువతలో నైపుణ్యాలను పెంపొందించాలి. ఎనర్జీ: సోలార్ ఎనర్జీని వినియోగించుకోవడంపై రాష్ట్రానికి సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
సిట్ ఏర్పాటు: చర్చల్లో భాగంగా రాష్ట్ర సామర్థ్యాలను పటిష్టం చేయడానికి గాను స్టేట్ ఇన్స్టిట్యూట్ అఫ్ ట్రాన్స్ఫర్మేషన్ (ఎస్.ఐ.టి) ను రాష్ట్రలో ఏర్పాటు చేయడంపై దృష్టి సారించారు.
మూసీ రివర్ ఫ్రంట్: అంతర్జాతీయ అత్యుత్తమ స్థాయిలో PPP మోడల్ ద్వారా సబర్మతి రివర్ ఫ్రంట్ మరియు నమామి గంగే వంటి ప్రాజెక్టుల మాదిరిగానే మూసి రివర్ ఫ్రంట్ ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడంకోసం సాంకేతిక సహకారం అందించాలని నీతి ఆయోగ్ ను ముఖ్యమంత్రి కోరారు. మురుగునీటి శుద్ధి ప్లాంట్స్ (STP) ఏర్పాటు కోసం సహకరించాలననీ కోరారు.
అర్బన్ గ్రోత్ హబ్‌గా హైదరాబాద్:
హైదరాబాద్ ను కాలుష్య రహిత నగరంగా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వ సహకారం అందించాలని అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి నీతి ఆయోగ్ ను కోరారు.
సహకార సమాఖ్య స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ప్రజల సంక్షేమం, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని సమన్వయంతో కలసి పనిచేయాలని నిర్ణయించారు. నీతి ఆయోగ్ పాలక మండలిలో రాష్ట్ర భాగస్వామ్యం కావాలని నీతి ఆయోగ్ కోరింది. నిర్మాణాత్మక మద్దతు మరియు సహకారం నీతి ఆయోగ్ కు అందిస్తామని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
ఈ సమావేశములో నీతి ఆయోగ్ నుండి వైస్ ఛైర్మన్ సుమన్ కుమార్, సభ్యులు విజయ కుమార్, డైరెక్టర్ జనరల్ సంజయ్ కుమార్, డైరెక్టర్ అభినేష్ డాష్, ముత్తు కుమార్, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రభుత్వ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.