కాంగ్రెస్ లో షర్మిల చేరిక చాలా లెక్కలు మార్చేయబోతున్నాయి. త్వరలోనే ఏపీ ఎన్నికలు జరగనుండడం.. గెలిచేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కట్టుగా వచ్చే అవకాశాలు ఉండడంతో వైసీపీకి సవాళ్లు పెరుగుతున్నాయి. ఇదే టైంలో కాంగ్రెస్ కూడా షర్మిల రూపంలో అస్త్రం ప్రయోగించడం మరింత కీలకంగా మారిపోయింది. ఇన్ని రోజులుగా సమాధానం లేకుండా ఉండిపోయిన చాలా ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడిప్పుడే రాబోతున్నాయి.
కాంగ్రెస్ లో షర్మిల చేరిపోయారు. పోషించబోయే పాత్ర ఏంటన్నది కూడా రేపో మాపో తెలియనుంది. అయితే ఇప్పుడు చర్చ అంతా షర్మిల ఏపీ పొలిటికల్ రోల్ గురించే నడుస్తోంది. రాజకీయ లెక్కలు ఎలా మారుతాయన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికైతే తొలి ఎఫెక్ట్ ఏపీ సీఎం జగన్ కే ఉండబోతోందంటున్నారు. ఎందుకంటే జగన్ కు షర్మిల స్వయానా సొంత చెల్లెలు. ఇద్దరూ చెరో పార్టీలో ఉండడంతో రాష్ట్ర ప్రజల్లోకి వేరుగా సంకేతాలు వెళ్లడం ఖాయమే. ఇద్దరూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసులు కావడంతో ఆయన అభిమానుల్లో పునరాలోచన మొదలయ్యే అవకాశాన్ని కూడా కొట్టి పారేయలేం. ఇందుకు ఉదాహరణ.. వైసీపీలో అసంతృప్తులు ఒక్కొక్కరుగా బయటికొస్తున్నారు. టిక్కెట్లు దక్కని వారిలో చాలా మందికి ఇప్పుడు ఆప్షన్ కాంగ్రెసే కనిపిస్తోంది. అదే సమయంలో సీఎం జగన్ కూడా రాజకీయాల కోసం కొందరు కుటుంబాలను కూడా చీలుస్తారని పరోక్షంగా చంద్రబాబు, కాంగ్రెస్ ను ఉద్దేశించి మాట్లాడారంటున్నారు. అయితే ఈ కామెంట్స్ పై చంద్రబాబు రివర్స్ కౌంటర్ కూడా ఇచ్చారు. తన కుటుంబంలో తాను చిచ్చుపెట్టుకుని తమపై పడడం ఏంటని ఫైర్ అయ్యారు. తల్లి, చెల్లి వ్యవహారం చూసుకోలేకపోతే తమకేంటి సంబంధమన్నారు.
షర్మిల ముఖ్యంగా ఏపీపై ఫోకస్ పెడితే మొదటి ప్రభావం వైఎస్ఆర్ కాంగ్రెస్ పైనే పడుతుంది. ఇప్పుడు దేనికైనా రెడీ అంటూ షర్మిల కాంగ్రెస్ లోకి వచ్చేశారు. ఏపీలో జగన్ తోనే ఢీ అంటే ఢీ అనే పరిస్థితి ఉంటుందనీ తెలుసు. అయినా సరే గేర్ మార్చి పొలిటికల్ స్పీడ్ పెంచేశారు. మరోవైపు ఏపీలో కాంగ్రెస్ ప్రభావం ఉండి తీరుతుందని షర్మిల భర్త అనిల్ కుమార్ అంటున్నారు. దీంతో వైసీపీ నేతలు అలర్ట్ అవుతున్నారు. ఇప్పుడు జగన్ కాదంటే… షర్మిల వైపే చూసే వారు చాలా మంది లీడర్లు ఉంటారు. ఎఫెక్ట్ అలా ఉంది మరి. ఎందుకంటే టిక్కెట్ రాని వారికి టీడీపీ, జనసేన కూటమిలో లీడర్లు ఓవర్ లోడ్ అవడంతో అక్కడ దొరికే ఛాన్స్ లేదు. అటు తిరిగి ఇటు తిరిగి కాంగ్రెస్ ఆప్షన్ గా పెట్టుకుంటున్నారు చాలా మంది వైసీపీ అసంతృప్త నేతలు.
వైసీపీ టిక్కెట్ కోసం ఆశ పడ్డ వారు, టిక్కెట్ దక్కని వారు ఇలా అందరూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అయితే ఆ పరిణామాలు ఎలా ఉంటాయన్నది కూడా ఆసక్తికరంగా మారుతోంది. ఎందుకంటే వైసీపీ అనుకూల ఓటు చీలుతుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా ఎటు వెళ్తుందన్నది కీలకంగా ఉంటుంది. కారణం ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలవద్దన్న ఉద్దేశంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీతో జట్టు కట్టారు. అదే సమయంలో బీజేపీతోనూ కలిసి పోటీ చేసే విషయంపై చర్చలు జరుపుతున్నారు. ఈ సమయంలో షర్మిల కాంగ్రెస్ రూపంలో ఏపీ పాలిటిక్స్ లోకి వస్తుండడంతో వ్యతిరేక ఓటు కొద్దిగా హస్తం పార్టీవైపు కూడా వెళ్లే ఛాన్స్ కనిపిస్తోంది. అదే జరిగితే ప్రత్యర్థులకు కష్టమన్న వాదన కూడా వినిపిస్తోంది.
అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడం కంటే అధికార వైసీపీకి ఎక్కువ నష్టం జరిగే ప్రమాదమే ఉందన్న వాదన వినిపిస్తోంది. దీంతో వైసీపీ, ఏపీ కాంగ్రెస్ నేతల మధ్య డైలాగ్ వార్ పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ వనవాసం ముగిసిందంటూ తులసీ రెడ్డి మాట్లాడారు. తమతో చాలా మంది వైసీపీ నేతలు టచ్ లో ఉన్నారంటూ చెప్పడం భవిష్యత్ సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయో చెప్పకనే చెబుతోంది.
మరోవైపు షర్మిల కాంగ్రెస్ లో చేరడంపై వైసీపీ కీలక నేతలు రియాక్ట్ అవుతున్నారు. తమ పార్టీకి వ్యతిరేకంగా పని చేసే వారు ఎవరైనా తమకు ప్రత్యర్థులే అని డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు. కుటుంబ కథా చిత్రంతో సంబంధం లేదని, ఎవరితోనైనా పోరాటానికి రెడీ అంటున్నారు. వైఎస్ తోడల్లుడు.. వైసీపీ ముఖ్య నేత వైవీ సుబ్బారెడ్డి షర్మిల కాంగ్రెస్ లో చేరికపై రియాక్ట్ అయ్యారు. ఏపీ వైసీపీలో షర్మిలకు అవకాశం లేకపోవడం వల్లే తెలంగాణలో పార్టీ పెట్టారన్నారు. అక్కడ కూడా పరిస్థితులను బట్టి కాంగ్రెస్ లో విలీనం చేశారన్నారు. షర్మిల ఏ పార్టీతో కలిసినా తమకు అభ్యంతరం లేదన్నారు. జగన్ అందించే సంక్షేమ పథకాలే మళ్లీ వైసీపీకి విజయాన్ని అందిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
మ్యాటర్ ఇక్కడితో ఆగలేదు. పెద్దిరాంచంద్రారెడ్డి మరో అడుగు ముందుకేసి షర్మిల వ్యవహారంపై ఘాటు కామెంట్స్ చేశారు. జగన్‌కు వ్యతిరేకంగా ఎవరు పని చేసినా వారిని ప్రత్యర్థులుగానే చూస్తామన్నారు. ఎవరొచ్చినా జగనే తమ నాయకుడన్నారు. కొందరు రాజకీయాల కోసం కుటుంబాలను చీలుస్తారన్న జగన్ వ్యాఖ్యలపైనా పెద్దిరెడ్డి మాట్లాడారు. సోనియా, చంద్రబాబు కుటుంబాలనే కాదు.. మనుషుల్ని చీల్చే రాజకీయం చేసే నైజం ఉన్న వారంటూ ఫైర్ అవుతున్నారు.
ఇప్పుడు అసలు పాయింట్ ఏంటంటే… షర్మిల కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. ఎక్కడ ప్రధాన పాత్ర పోషిస్తారన్నది తేలాల్సి ఉంది. మరో అంశం ఏంటంటే.. వైసీపీతో సహా టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి టిక్కెట్ దక్కని నేతలంతా షర్మిలతో నడుస్తారా అన్నది కీలకం. ఇంకోవైపు ఏపీలో వైఎస్ తనయగా షర్మిలను చూసి ఓట్లు వేసే పరిస్థితి ఎంత వరకు ఉందన్నది చర్చనీయాంశమవుతోంది. ఎన్నికలకు మరో మూడు నాలుగు నెలల సమయం మాత్రమే ఉంది. ఇంత తక్కువ టైంలో ఎంత వరకు ఇంపాక్ట్ చేస్తారన్నది చూడాలి.