ఏపీ సీఎం జగన్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రిని పరామర్శించడం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ నెల 7వ తేదీన కేసీఆర్ ఇంట్లో కాలుజారి కిందపడ్డారు. దీంతో తుంటి ఎముక విరిగి యశోద ఆస్పత్రిలో చికిత్స తర్వాత.. నందినగర్‌లోని ఆయన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కేసీఆర్‌ను పరామర్శించారు జగన్. ఏపీ నుంచి బేగంపేటకు చేరుకున్న ఆయనకు మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డితోపాటు పలువురు బీఆర్‌ఎస్ నేతలు స్వాగతం పలికారు.
అనంతరం నందినగర్‌కు చేరుకుని కేసీఆర్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా సుమారు 45 నిమిషాలపాటు వీరి భేటీ సాగింది. అయితే.. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన రోజే కేసీఆర్‌ను జగన్‌ను కలవడం వెనుక పొలిటికల్ వ్యూహం ఏదో ఉందన్న టాక్ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. కేసీఆర్ తో ఏ అంశాలు చర్చించారనే ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది.
ఈ భేటీ అనంతరం సీఎం జగన్ లోటస్‌పాండ్‌కు వెళ్లారు. దాదాపు రెండేళ్ల తర్వాత జగన్ లోటస్‌పాండ్‌కు వెళ్లడం కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.చెల్లెలు షర్మిల కాంగ్రెస్‌లో చేరడం,.. పొలిటికల్ వార్‌కు సిద్ధమైన సమయంలో తల్లి విజయమ్మను జగన్ కలవడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.