రాష్ట్రంలోని నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2న 3 నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నట్లు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. హైదరాబాద్ లో టీజీపీఎస్సీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇకపై ప్రతి నెలా ఉద్యోగ నోటఫికేషన్లను జారీ చేయనున్నట్టు స్పష్టంచేశారు. జూన్ లో మరిన్ని పోస్టులను భర్తీ చేస్తామని, ఇకపై ప్రతి నెలా రెండు, మూడు నోటిఫికేషన్లను జారీ చేస్తామని కమిషన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్టు తెలిపారు.
3,800 పోస్టుల భర్తీ..
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 3,800 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందని చైర్మన్ స్పష్టం చేశారు. నేడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 19 అసిస్టెంట్ ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్ పోస్టులు, రోడ్లు భవనాల శాఖలో 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(సివిల్) పోస్టులకి, అలాగే 49 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఎలక్ట్రికల్) పోస్ట్‌లకి నోటిఫికేషన్లను జారీ చేయనున్నట్టు తెలిపారు. రాబోయే నోటిఫికేషన్లలో అత్యధికంగా ఆటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు 1393 ఉన్నాయని తెలిపారు. విద్యాశాఖలో ఖాళీగా ఉన్న డిప్యూటీ డీఈవో పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషను జారీ చేయనున్నట్టు తెలిపారు. వీటికి ఇంటర్వ్యూలు ఉండబోవని తెలిపారు. కేవలం డిగ్రీ లెక్చరర్ పోస్టులకు మాత్రమే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) నిబంధనల మేరకు ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్టు తెలిపారు.
ప్రశ్నాపత్రంను సిద్ధం..
భవిష్యత్తులో రిక్రూట్మెంట్ ప్రక్రియలో భారీ సంస్కరణలు తీసుకొస్తున్నామని, ఇకపై జరగబోయే పరీక్షలన్నీ పారదర్శకంగా, లీకేజీలకు తావు లేకుండా పూర్తి స్థాయిలో కంప్యూటర్ విధానంలోనే (సీబీటీ) నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. పరీక్షలకు సంబంధించిన ప్రశ్నా పత్రం ఒక రోజు ముందు. లేదంటే అదేరోజు పరీక్షకు కొన్ని గంటల ముందుగానే ప్రశ్నాపత్రంను సిద్ధం చేసేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఇలా చేయడం వల్ల అక్రమాలు జరిగే అవకాశం ఉండబోదన్నారు. ఓఎంఆర్ పద్ధతిలో పరీక్ష నిర్వహణ చాలా క్లిష్టమైందన్నారు. అభ్యర్థులు కంప్యూటర్ బేస్డ్ పరీక్షలకు సిద్ధంగా ఉండాలని.. సాధ్యమైనంత వరకూ పరీక్షలు ఈ విధానంలోనే ఉంటాయని స్పష్టం చేశారు. కేంద్రంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్స్ఈ) అనుసరిస్తున్న ప్రతిభా సేతు విధానం తరహాలోనే తెలంగాణలో కూడా పరీక్షల నిర్వహణకు ప్రతిభా భారతి అనే సరికొత్త పద్ధతిని తీసుకురానున్నట్లు తెలిపారు.
మాపై కొపం..
ప్రస్తుతం 28 రకాల పోస్టులకు ఒక్కో ఖాళీ ఉందని, ఇంకో 25 రకాల పోస్టుల్లో 5 కంటే తక్కువ ఖాళీలు ఉన్నాయని బుర్రా వెంకటేశం తెలిపారు. 50 కంటే ఎక్కువ పోస్టులు ఖాళీగా ఉన్నది 11 శాఖల్లోనేనని తెలిపారు. భవిష్యత్ లో రెండు, మూడు నెలలకోసారి మీడియా సమావేశాలు నిర్వహిస్తామని కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. మీడియాతో మాట్లాడకపోవడం కంటే మాట్లాడటమే మంచిదని భావిస్తున్నామన్నారు. ఉద్యోగాలు వచ్చిన వారి కంటే రాని వారి సంఖ్యే ఎక్కువగా ఉంటుందని.. అందరికీ ఉద్యోగం ఇవ్వడం ఎప్పటికీ సాధ్యం కాదని స్పష్టం చేశారు. తమది చాలా క్లిష్టమైన ఉద్యోగమని, అందరినీ మెప్పించడం సాధ్యం కాదన్నారు. అందుకే తమపై ఎక్కువ మందికి కోపం ఉంటుందన్నారు. అందులో తప్పు కూడా లేదన్నారు.
వన్ టైం రిజిస్ట్రేషన్..
కమిషన్ పై అసత్యాలు ప్రచారం చేసేవారు ఎప్పుడూ ఉంటారని, అలాంటి గురించి పట్టించుకుంటే తాము అనుకున్న పనులను సక్రమంగా నిర్వహించ లేమన్నారు. అయితే.. చేయని తప్పును.. చేశామని చెబితే ఇకనుంచి ఊరుకునేది లేదని బుర్రా వెంకటేశం హెచ్చరించారు. గతంలో ఊరుకునే వాళ్ళని, కానీ ఇకనుంచి అలా చేస్తే ఎవరినీ వదిలిపెట్టబోమమన్నారు. లీగల్ గా చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ప్రజాస్వామ్య దేశం కాబట్టి సలహాలు, సూచనలు ఇస్తామంటే ఇవ్వొచ్చని, కానీ చేయని తప్పును రుద్దకూడదన్నారు. ఇదిలాఉండగా అభ్యర్థులు వన్ టైం రిజిస్ట్రేషన్(ఓటీఆర్)ను అప్ డేట్ చేసుకోవాలని సూచించారు. దీనివల్ల భవిష్యత్ లో అభ్యర్థులకు సులువవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి, ప్రొఫెసర్ ఎల్ బీ లక్ష్మీకాంత్ రాథోడ్, విశ్వ ప్రసాద్, డాక్టర్ అమీర్ ఉల్లాఖాన్, కార్యదర్శి హరిత పాల్గొన్నారు.