ఏప్రిల్‌ 14 తర్వాత ప్రారంభించేందుకు సమాలోచన

ప్రాణాంతక కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునే దిశగా మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను ఎత్తివేసే దిశగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంకేతాలిచ్చారు. లాక్‌డౌన్‌ కాలపరిమితి ముగిసిన ఏప్రిల్‌ 14 తరువాత ఈ దేశవ్యాప్త దిగ్బంధాన్ని దశలవారీగా ఎత్తివేసే దిశగా ఆలోచిస్తున్నట్లు గురువారం ముఖ్యమంత్రులతో జరిపిన వీడియో కాన్ఫెరెన్స్‌లో వెల్లడించారు. ఏప్రిల్‌ 14 వరకు పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ను అమలు చేసి, ఆ తరువాత పరిస్థితులను బేరీజు వేసుకుంటూ దశలవారీగా ఎత్తివేసేందుకు ఒక నిష్క్రమణ వ్యూహాన్ని రూపొందించాల్సి ఉందని సీఎంలతో ఆయన వ్యాఖ్యానించారు. అందుకు అవసరమైన సూచనలను ఇవ్వాల్సిందిగా ఆయన సీఎంలను కోరారు.

సాధారణ స్థితి నెలకొనేవరకు సమన్వయ పూరిత నిష్క్రమణ వ్యూహాన్ని అమలు చేయాలన్నారు. అలాగే, కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు రానున్న వారాల్లో నిర్ధారణ పరీక్షల నిర్వహణ(టెస్ట్‌), అనుమానితుల గుర్తింపు(ట్రేస్‌), వారిని ఐసోలేట్‌ చేయడం, క్వారంటైన్‌ చేయడం అనే అంశాలపై నిశిత దృష్టి పెట్టాలని మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. ప్రాణ నష్టాన్ని అత్యంత కనిష్ట స్థాయికి చేర్చడమే అందరి ఉమ్మడి లక్ష్యం కావాలన్నారు. ఏప్రిల్‌ 14న లాక్‌డౌన్‌ కాలం ముగిసిన తరువాత సాధారణ స్థితికి వచ్చేందుకు సమన్వయ పూరిత నిష్క్రమణ వ్యూహాన్ని అమలు చేయాలని, ఆ దిశగా తమకు సూచనలు చేయాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *