ప్రఖ్యాత దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళిపై ఇటీవల మహేష్ బాబు హీరోగా ప్రకటించిన ‘వారణాసి’ (Varanasi film) చిత్ర ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యల కారణంగా ఎఫ్ఐఆర్ (FIR) నమోదైంది. ‘బాహుబలి’, ‘RRR’ వంటి చిత్రాలతో అంతర్జాతీయ ఖ్యాతి పొందిన రాజమౌళి, ఈ మెగా ఈవెంట్ (గ్లోబ్‌ట్రాటర్)లో ఆంజనేయ స్వామి గురించి మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. సుమారు 50 వేల మంది ఫ్యాన్స్ హాజరైన ఈ ఈవెంట్‌లో ఒక టెక్నికల్ ప్రాబ్లమ్ ఏర్పడినప్పుడు, రాజమౌళి చిరాకు పడుతూ “దేవుడంటే నాకు పెద్దగా నమ్మకం లేదు. మా నాన్న వచ్చి, హనుమంతుడు అన్నీ చూసుకుంటాడు అన్నారు. గ్లిచ్ వచ్చిన వెంటనే నేను నాన్నతో కోపంగా.. ‘ఆయన నన్ను ఇలా చూసుకుంటున్నారా’ అని అడిగాను” అని వ్యాఖ్యానించారు.
రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు వెంటనే వైరల్ అయ్యాయి. దేవుళ్లపై నమ్మకం ఉన్నవారి సెంటిమెంట్స్‌ను తీవ్రంగా హర్ట్ చేశాయని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, ‘రాష్ట్రీయ వానర సేన’ అనే ఆర్గనైజేషన్ స్పందించింది. ఒక పబ్లిక్ ఈవెంట్‌లో హనుమంతుడిని ఉద్దేశించి డైరెక్టర్ చేసిన అవమానకరమైన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని ఆరోపిస్తూ ఈ సంస్థ ఆయనపై ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీని కారణంగా రాజమౌళిపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
రాష్ట్రీయ వానర సేన తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఒక పోస్ట్ షేర్ చేస్తూ, రాజమౌళిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. “ఫ్యూచర్‌లో ఎవరూ హిందూ దేవతలను, దేవుళ్లను అవమానించే సాహసం చేయొద్దు. అందుకే మేం ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం” అని ఆ సంస్థ పేర్కొంది. అయితే, ఈ వివాదంపై రాజమౌళి లేదా మూవీ యూనిట్ నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక స్పందన రాలేదు.