అమెరికా చట్టసభ సభ్యుల మధ్య కీలక బిల్లులపై సయోధ్య కుదరకపోవడంతో అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ 31 రోజులుగా కొనసాగుతోంది. ఈ సుదీర్ఘ మూసివేత కారణంగా అగ్రరాజ్యానికి భారీ ఆర్థిక నష్టాన్ని మిగులుస్తోంది. తాజాగా కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ (సీబీఓ) విడుదల చేసిన అంచనాల ప్రకారం, ఈ 31 రోజుల షట్‌డౌన్ వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ నుంచి 7 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.62,149 కోట్లు) విలువైన సంపద శాశ్వతంగా ఆవిరైంది.
సుదీర్ఘకాలిక ఆర్థిక నష్టం హెచ్చరికలు ఈ షట్‌డౌన్ ఇలాగే కొనసాగితే, 6 వారాలకు 11 బిలియన్ డాలర్లు, 8 వారాలకు 14 బిలియన్ డాలర్ల మేర ఆర్థిక నష్టం ఏర్పడుతుందని సీబీఓ హెచ్చరికలు జారీ చేసింది. ఈ షట్‌డౌన్ ప్రభావం అమెరికన్ ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలికంగా తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రముఖ ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే బలహీనంగా ఉందని, ఈ షట్‌డౌన్ ఊహించిన దానికంటే పెద్ద సమస్యగా పరిణమించి ఆర్థిక వృద్ధిని మందగింపజేస్తుందని నిపుణులు హెచ్చరించారు.
ఉద్యోగ మార్కెట్‌పై ప్రభావం విశ్లేషకుల అంచనా ప్రకారం, ప్రతివారం అమెరికా ఆర్థిక వృద్ధిలో 0.1 నుంచి 0.2 పాయింట్లు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఇది ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసి, ఆర్థిక, విధానపరమైన అనిశ్చితి కారణంగా మార్కెట్లకు అంతరాయం కలిగిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఆటోమేషన్‌ను ప్రవేశపెట్టడం వల్ల ఇప్పటికే బలహీనంగా ఉన్న జాబ్ మార్కెట్‌పై ఈ ప్రభుత్వ మూసివేత ప్రభావం చూపనుందని, ఉద్యోగాల కోతలను మరింత పెంచే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.