హ్యాపీ హోలీ అంటూ భూలక్ష్మీ ఆలయంలో అధికారిపై యాసిడ్ దాడి..

హైదరాబాద్ నగరంలో హోలీ పండగ రోజున దారుణ ఘటన చోటు చేసుకుంది. సైదాబాద్ భూలక్ష్మీ మాతా ఆలయం అకౌంటెంట్‌పై యాసిడ్ దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తి గుడిలోకి వచ్చి ‘హ్యాపీ హోలీ’ అంటూ అకౌంటెంట్‌ తలపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అకౌంటెంట్ నర్సింగ్ రావుకు తీవ్ర గాయాలయ్యాయి. దాడికి పాల్పడిన అనంతరం ఆ దుండగుడు అక్కడ్నుంచి పరారయ్యాడు.

 

దాడికి సంబంధించిన దృశ్యాలు ఆలయంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే నిందితుడు అక్కడ్నుంచి జారుకున్నాడు. నిందితుడు క్యాప్ తోపాటు మాస్క్ పెట్టుకోవడం గమనార్హం. నిందితుడు పక్కా ప్రణాళిక ప్రకారమే ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. నిందితుడు ఎవరు? ఎందుకు దాడి చేశాడనేది తెలియాల్సి ఉంది.

 

కాగా, యాసిడ్ దాడిలో గాయపడిన వ్యక్తి కేకలు వేస్తూ తీవ్ర వేదనను అనుభవించాడు. గాయపడిన నర్సింగ్ రావును స్థానికులు యశోదా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న సైదాబాద్ పోలీసులు ఆలయంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

 

ఇది ఇలావుండగా, జగిత్యాలలో హోలీ పండగ రోజు విషాద ఘటన చోటు చేసుకుంది. వెల్దుర్తి మండలం భావోజిపల్లి శివారులోని ఎస్సారెస్పీ కాలువలో ఈతకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. స్నేహితులతో కలిసి హోలీ ఆడిన సాగర్ అనే వ్యక్తి ఎస్సారెస్పీ కాలువలోకి స్నానం చేసేందుకు దిగాడు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రెండుగంటలపాటు గాలింపు చేపట్టగా సాగర్ మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *