హోలీ వేడుకల్లో గంజాయి కుల్ఫీ, ఐస్‌క్రీమ్స్ ..!

హైదరాబాద్ నగరంలో హోలీ వేడుకలు అంబరాన్నంటాయి. అయితే, కొందరు హోలీ వేడుకలను ఆసరా చేసుకుని తమ మత్తు దందాకు తెరలేపారు. హోలీ వేడుకల్లో గంజాయితో తయారు చేసిన కుల్ఫీ, ఐస్‌క్రీమ్ తోపాటు గంజాయి బాల్స్, చాక్లెట్స్ విక్రయిస్తున్న ముఠాను స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

హైదరాబాద్ మహా నగరంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు వారి వారి రీతుల్లో హోలీ వేడుకను జరుపుకుంటున్నారు. కాగా, దూల్‌పేట్‌లోని మల్చిపురాలో కుల్ఫీ, ఐస్‌క్రీమ్, బర్ఫీ స్వీటులో, సిల్వర్ కోటెడ్ బాల్స్‌లో గంజాయి వినియోగిస్తూ సంబరాలు జరుపుకున్నారు. సమాచారం అందుకున్న ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్టీఎఫ్ పోలీసులు దాడులు నిర్వహించి నిందితులను అరెస్ట్ చేశారు.

 

మత్తు పదార్థాలను తినే పదార్థాలలో కలిపి విక్రయిస్తున్నవారికి వ్యాపారం చేసుకునే అనుమతులు కూడా లేవని, వీరి ముఠాలో మరెంత మంది ఉన్నారనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. దర్యాప్తు కొనసాగుతోందని. మరింత సమాచారం త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

 

100 కుల్ఫీ, 72 బర్ఫీ స్వీట్లు, సిల్వర్ కోటెడ్ బాల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. కుల్ఫీ, ఐస్ క్రీమ్ విక్రయించే సత్యనారాయణ సింగ్.. గంజాయితో వీటిని తయారు చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, గంజాయి బర్ఫీ, చాక్లెట్లను స్వాధీనం చేసుకున్న సిబ్బందిని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి అభినందించారు.

 

కాగా, మత్తు పదార్థాల వినియోగం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో గంజాయి విక్రయాలను పూర్తిగా అరికట్టేందుకు పోలీసులు, ఎక్సైజ్ శాఖ చర్యలు తీసుకుంటున్నాయని చెప్పారు. ఎవరైనా అనుమానాస్పదంగా వ్యాపారం నిర్వహిస్తున్నట్లు అనిపిస్తే.. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *