తెలంగాణలో పాఠశాల విద్యార్థులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అవుతుండడంతో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నట్లు తెలిపింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఎల్లుండి నుంచి విద్యా సంవత్సరం ముగిసేవరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నట్లు పేర్కొంది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్న అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు మార్నింగ్ 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పనిచేస్తాయని వివరించింది. స్కూళ్లో పిల్లలకు మధ్యాహ్నం 12:30 గంటలకు భోజనం అందించి ఇంటికి పంపనున్నారు.
టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షలకు స్టూడెంట్స్ ను సన్నద్ధం చేసేందుకు స్పెషల్ క్లాసెస్ కొనసాగుతాయని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తెలిపారు. ఎస్ఎస్‌సీ పరీక్ష కేంద్రాలు ఉన్న స్కూళ్లు మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయని పేర్కొన్నారు. 2024-25 విద్యా సంవత్సరంలో చివరి రోజు ఏప్రిల్ 23 వరకు ఒంటి పూట బడులు కొనసాగనున్నాయి. ఆదేశాలను అన్ని మేనేజ్‌మెంట్లు అమలు పరిచేలా పాఠశాల విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్‌లు, జిల్లా విద్యాశాఖ అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.