దేశంలో పార్లమెంట్, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన జమిలి ఎన్నికల బిల్లుపై కేంద్ర ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పటికే.. ఈ బిల్లు రూపకల్పనకు అనేక జాగ్రత్తలు తీసుకున్న కేంద్రం.. తాజాగా జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాలని భావించింది. ఈ మేరకు ప్రత్యేక ప్రకటన చేసిన కేంద్రం.. సభలో ప్రవేశపెట్టే బిల్లుల జాబితాలోనూ పొందుపరిచింది. కానీ.. మళ్లీ ఏమైందో ఏమో కానీ, తాజాగా సభ ముందుకు రానున్న బిల్లుల జాబితా నుంచి జమిలీ ఎన్నికల బిల్లును తొలగించింది. దీంతో.. కేంద్రం ఎలాంటి ఆలోచనలు చేస్తుందోనని చర్చ మొదలైంది.
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఈ నెల 16న అంటే సోమవారం నాడు సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు రానున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు లోకసభ బిజినెస్ జాబితాలో బిల్లు వివరాల్ని పొందుపరిచింది. ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్ వాల్.. జమిలి ఎన్నికల బిల్లును సభలో ప్రవేశపెడతారని పేర్కొంది. కానీ.. తాజాగా జారీ చేసిన జాబితాలో లోక్ సభ బిజినెస్ జాబితాలో జమిలి ఎన్నికల బిల్లులు లేవు. దీంతో పాటు ముందుగా నిర్దేశించిన మరో బిల్లును కేంద్రం జాబితా నుంచి తొలగించింది.
ప్రస్తుత శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 20 వరకు కొనసాగనున్నాయి. ఈ తరుణంలో మరికొద్ది రోజులు మాత్రమే ఉన్న సమయంలో కీలక బిల్లును జాబితా నుంచి ఎందుకు తొలగించారనేది ప్రశ్నగా మారింది. ప్రస్తుత పరిణామాలను చూస్తే.. ప్రస్తుత సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
వాస్తవానికి ఈ బిల్లును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్రం గట్టి కసరత్తులే చేసింది. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి మరీ కసరత్తులు చేసింది. పైగా.. విపక్షాల మద్ధతు కూడగట్టేందుకు సైతం అనేక ప్రయత్నాలు చేసింది. అన్ని పార్టీల మద్ధతు సాధించేందుకు, వారితో సంప్రదింపులు సైతం జరిపింది. ప్రభుత్వ దూకుడు చూసి.. ప్రతిపక్షాలు సైతం ఈ బిల్లు తాజా సమావేశాల్లో చర్చకు రావచ్చని భావించాయి. అందుకే.. అధికార, ప్రతిపక్ష పార్టీలు సోమ, మంగళ వారాల్లో తమ సభ్యులంతా పార్లమెంట్ సమావేశాలకు తప్పక హాజరు కావాల్సిందేనని విప్ జారీ చేశారు.
జమిలి ఎన్నికల బిల్లు పార్లమెంట్ లో చర్చకు వస్తే ఎలాంటి చర్చ జరుగుతుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. సరిగా ఇలాంటి సమయంలో కేంద్రం ఎందుకు వెనుకడుగు వేసిందోననే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ బిల్లు ద్వారా లోక్ సభ, అసెంబ్లీలతో పాటు స్థానిక సంస్థలకు సైతం ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించాలని రామ్ నాథ్ కోవింద్ కమిటీ సిఫార్సులు చేసింది. కానీ.. స్థానిక సంస్థల ఎన్నికలను పక్కన పెట్టిన కేంద్రం.. కేవలం లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలను మాత్రమే ఒకేదశలో నిర్వహించేందుకు వీలుగా చట్ట, రాజ్యాంగ సవరణలు చేసేందుకు సిద్దమైంది.
ఇందుకోసం.. జమిలి ఎన్నికల అమలుకు వీలు కల్పించేలా రాజ్యాంగంలో కొత్తగా 82ఎ అధికరణాన్ని చేర్చనున్నారు. పార్లమెంటు పదవీ కాలంలో మార్పు చేసేందుకు అధికరణం 83ని, అసెంబ్లీల పదవీ కాలాల సవరణకు అధికరణం 172 మార్చాలని రామ్ నాథ్ కోవింద్ కమిటీ సూచించింది. ఎన్నికల నిబంధనల రూపకల్పన కోసం పార్లమెంటుకు అధికారం కల్పించేలా అధికరణం 327ని సవరించాల్సి ఉంటుంది.