దిల్లీ పీఠం మళ్లీ నాదే అంటున్న కేజ్రీవాల్.. ఏకంగా అభ్యర్థుల్నే ప్రకటించేశాడు

దేశ రాజధాని దిల్లీ అసెంబ్లీని ముచ్చటగా మూడో సారి చేజిక్కించుకునేందుకు సిద్ధమైన కేజ్రీవాల్.. వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. మొత్తంగా 70 సీట్లు ఉన్న దిల్లీ అసెంబ్లీలో వరుసగా విజయ పతాకం ఎగురవేస్తూ వస్తున్న కేజ్రీవాల్ పార్టీ.. ఈ సారి అదే ఒరవడి సాగించాలని చూస్తోంది. ఈ క్రమంలోనే మిగతా పార్టీలకంటే ముందే అభ్యర్థుల్ని ప్రకటిస్తూ దూకుడు ప్రదర్శిస్తోంది.

 

మొదటి మూడు జాబితాల్లో 32 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన కేజ్రివాల్.. ఇప్పుడు మూడో జాబితాలో మరో 38 మంది పేర్లను ప్రకటించారు. తాము ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమంటూ ప్రకటించారు. తనపై ఈడీ కేసుల నమోదు, నెలల తరబడి జైలులో ఉన్న నేపథ్యంలో.. ఈ ఎన్నికల్ని ఆమ్ ఆద్మీ పార్టీ సీరియస్ గా తీసుకుంది. ఈ ఎన్నికల్లో గెలిచి.. ప్రజా క్షేత్రంలో తమకు తిరుగులేదని, ప్రజా విశ్వాసాన్ని కోల్పోలేదని నిరూపించుకోవాలని ప్రయత్నిస్తోంది. అందుకే.. మిగతా పార్టీలు ఇంకా దిల్లీ ఎన్నికలకు సంసిద్ధంగా లేనప్పుడే.. అభ్యర్థుల జాబితాను ప్రకటించి, ఎన్నికల్లో పోటీసి సై అంటోంది.

 

ప్రస్తుత జాబితాలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (), ప్రస్తుత దిల్లీ సీఎం ఆతిశీలు పోటీ చేయనున్న స్థానాలపై స్పష్టత వచ్చింది. ఇన్నాళ్లు.. వీరిరువురు ఎక్కడ నుంచి పోటీలో నిలుచుంటారోననే సందేహాలున్నాయి. వారి పాత స్థానాల్లో ఏవరికైనా కొత్తవారికి చోటు కల్పించి, వారు వేరే ప్రాంతాలను ఎంచుకుంటారా అనే వార్తలు వచ్చాయి. కానీ.. వాటన్నింటినీ చెక్ పెడుతూ.. కేజ్రీవాల్ న్యూదిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనుండగా, సీఎం ఆతిశీ మరోసారి కాల్కాజీ సీటు నుంచే బరిలో నిలువనున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది.

 

క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టత, ఎమ్మెల్యేల పనితీరును పరిగణలోకి తీసుకున్న కేజ్రీవాల్..అనేక మార్పు చేర్పులు చేశారు. ఈ సారి ఎన్నికల్లో ఏకంగా 20 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు నిరాకరించారు. వారి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పిస్తున్నట్లు తాజాగా.. అభ్యర్థుల జాబితా విడుదల సందర్భంగా వెల్లడించారు. ప్రస్తుత జాబితాలో కీలక నాయకులు పోటీలో నిలుచున్న స్థానాలపై స్పష్టత వచ్చింది. దాని ప్రకారం.. గ్రేటర్‌ కైలాశ్‌ సీటు నుంచి సౌరభ్‌ భరద్వాజ్‌, బాబర్‌పుర్‌ నుంచి గోపాల్‌రాయ్‌, ఓఖ్లా నుంచి అమానతుల్లా ఖాన్‌, షాకుర్‌బస్తీ నుంచి సత్యేందర్‌కుమార్‌ జైన్‌ను పోటీలో నిలువనున్నారు. తాజాగా.. బీజేపీ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన రమేష్ పెహల్వాన్ కు కస్తూర్భా నగర్ నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పించిన అరవింద్ కేజ్రీవాల్.. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మదన్‌లాల్‌ కు సీటు నిరాకరించారు.

 

దిల్లోలో ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీ నుంచే పోటీ ఎదురవనుంది. ఈ నేపథ్యంలోనే బీజేపీకి దిల్లీ పై పట్టు పూర్తిగా కోల్పోయిందంటూ కేజ్రివాల్ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. ఆ పార్టీకి సీఎం అభ్యర్థి లేకుండా పోయారని, పోటీని నడిపేందుకు టీమ్ సైతం లేదన్న కేజ్రీవాల్.. వారికి దిల్లీ అభివృద్ధిపై ఓ విజన్ కూడా లేదని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ నేతలకు దిల్లీపై ఎలాంటి పట్టింపు లేదన్న మాజీ సీఎం.. వారి నినాదం కేవలం కేజ్రీవాల్ ను తొలగించడమే అంటూ చురకలు అంటించారు. కానీ.. తమ పార్టీకి దిల్లీ అభివృద్ధి గురించి అనేక ఆలోచనలు ఉన్నాయన్న కేజ్రీవాల్.. వాటిని అమలు చేసేందుకు విద్యావంతులో కూడిన సమర్థవంతమైన టీమ్ ఉందని ప్రకటించారు. తమ పదేళ్ల పరిపాలనలో చేసిన అనేక పనులు ప్రజలకు తెలుసని.. ఎవరికి ఎవరు ఓటు వేయాలో వారికి బాగా తెలుసు అంటూ వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *