వైసీపీకి వరుస షాకుల మీద షాకులు తగులుతున్నాయి.గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుంచి ఆ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. వైసీపీని వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. కొందరు వైసీపీ నేతలపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తుండగా, మరి కొందరు నేతలు వైసీపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని భావించి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. కిలారు రోశయ్య, మద్దాలి గిరి, సిద్దా రాఘవరావు, మాజీ మంత్రి ఆళ్ల నాని , బాలినేని, సామినేని ఉదయభాను, అలీ, పోసాని కృష్ణమురళి,వాసిరెడ్డి వంటి నేతలు వైసీపీకి రాజీనామా చేశారు.
మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు , ఆర్ కృష్ణయ్య వంటి రాజ్యసభ సభ్యులు తమ పదవులతో పాటు వైసీపీకి సైతం రాజీనామా చేశారు. మరో ముగ్గురు ఎమ్మెల్సీలు కూడా వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీ గూటికి చేరారు. తాజాగా ఈ లిస్ట్‌లో మాజీ మంత్రి జోగి రమేష్ పేరు వినిపిస్తోంది. కూటమి నేతలతో కలిసి ఆయన ర్యాలీలో పాల్గొనటం సంచలనంగా మారింది. దీంతో జోగి రమేష్ వైసీపీకి గుడ్ బై చెప్పడం ఖాయమనే ప్రచారం ఊపందుకుంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు ఇంటిపై దాడి ఘటనలో జోగి రమేష్ పై కేసు నమోదు చేశారు.
పోలీసుల విచారణకు హజరయ్యారు. జోగి కుమారుడిపై కూడా అగ్రిగోల్డ్ భూముల విషయంలో కేసు నమోదైంది. దీంతో, కొంత కాలంగా జోగి రమేష్ పార్టీ వ్యవహారాలకు అంటీ ముట్ట నట్లుగా ఉంటున్నారు. ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం సాగింది.తాజాగా టీడీపీ నేతలతో జోగి రమేష్ కనిపించటంతో పార్టీ మార్పు ప్రచారం మొదలైంది.అయితే దీనిపై జోగి వర్గం వాదన మరోలా ఉంది.
గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణకు రాజకీయాలకు సంబంధం లేదని జోగి రమేష్ మద్దతు దారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే పార్టీ మార్పుపై జోగి రమేష్ తేల్చేశారు. మాజీ మంత్రి పేర్ని నానిపై అక్రమ కేసులు బనాయించి, ఆయన్ను ఇబ్బందిపెట్టాలని చూస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈక్రమంలో వైసీపీ నేతలు పేర్ని నాని ఇంటికి వెళ్లి ఆయనకు తమ సానుభూతిని తెలియజేశారు. పేర్ని నాని ఇంటికి వెళ్లిన వారిలో జోగి రమేష్ కూడా ఉన్నారు. దీంతో ఆయన తాను వైసీపీలోనే ఉంటానని స్పష్టం చేసినట్టు అయింది.