రాజ్యసభ చైర్మెన్, ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధనఖర్‌పై ఇండియా కూటమికి చెందిన ప్రతిపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. మంగళవారం రాజ్యసభ సెక్రటరీ జెనెరల్ కు ఈ అవిశ్వాస తీర్మాన పత్రాన్ని ప్రతిపక్ష పార్టీలు సమర్పించాయి. అయితే ఈ అవిశ్వాస తీర్మానం ప్రస్తుత శీతకాల సమావేశాల్లో చెల్లుబాటు కాదని తెలుస్తోంది.
అవిశ్వాస తీర్మానంపై నిబంధనలు ఏంటి?
పార్లమెంటు నిబంధనల ప్రకారం.. రాజ్యసభ చైర్మెన్ పై అవిశ్వాస తీర్పానం సమర్పించాలంటే అందుకు ముందుగానే 14 రోజుల నోటీసులివ్వాలి. కానీ ప్రస్తుతం శీతాకాల సమావేశాల్లో మరో 10 రోజుల మాత్రమే నడుస్తాయి. ఈ కారణంగా ఈ అవిశ్వాస తీర్మానం ప్రస్తుతానికి చెల్లుబాటు కాదు. దీంతో అధికార కూటమి పార్టీలు ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపక్ష పార్టీల రాజకీయ ఎత్తు మాత్రమేనని వ్యాఖ్యానిస్తున్నాయి.
అవిశ్వాస తీర్మానం ఎందుకు?
రాజ్యసభ చైర్మెన్ జగ్దీప్ ధనఖర్ పక్షపాతం చూపుతున్నారని.. ఆయన తీరు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి మాత్రమే లాభం చేకూర్చేలా ఉందని ఇండియా కూటమి పార్టీలు తీవ్రంగా ఆరోపణలు చేశాయి. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులు సభలో మాట్లాడడానికి ఆయన అనుమతి ఇవ్వడం లేదని.. ఎప్పుడూ ప్రతిపక్ష పార్టీ నాయకుల మైక్ స్విచాఫ్ చేయిస్తారిన ఆయనపై తరుచూ ప్రతిపార్టీ సభ్యులు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.
రాజ్యసభ చైర్మెన్ ని తొలగించడానికి నిబంధనలివే..
రాజ్యసభ చైర్మెన్ ని తొలగించాలంటే కనీసం 50 మంది ఎంపీలు ఒక నోటీస్ ఇవ్వాలి. అయితే ఆ నోటీసు పార్లమెంటు సమావేశాలు ముగిసే 14 రోజుల ముందే ఇవ్వాలి. రాజ్యసభ్యలో సింపుల్ మెజారిటీతో ఆ నోటీసుని రాజ్యసభ జరిగే సమయంలో లేదా ముగిసిన తరువాత అయినా లోక్ సభలో దీన్ని అమోదించవచ్చు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 67 (b) దీన్ని గురించే ప్రస్తావన ఉంది.
రాజ్యసభ చైర్మెన్ పై అవిశ్వాస తీర్మనం ప్రవేశ పెట్టిన తరువాత ప్రతిపక్ష కూటమిలో తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) ఎంపీ సుష్మిత దేవి మాట్లాడతూ.. “టిఎంసి ఎంపీలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. పార్లమెంటులో రాజ్యాంగ పరంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికే మేము అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాం. మోడీ ప్రభుత్వం పార్లమెంటు వ్యవస్థని హత్య చేస్తోంది.. అందుకే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాం. ప్రజల సమస్యల గురించి ప్రతిపక్ష పార్టీల నాయకులు మాట్లాడడానికి వారు అనుమతి ఇవ్వడం లేదు. మేము ప్రజా సమస్యలపై చర్చ జరగాలని కోరుకుంటుంన్నాం. మా నాయకురాలు మమతా దీది నిరుద్యోగం, నిత్యావసరాల ధరల పెరుగుదల, మణిపూర్, రాష్ట్రానికి (పశ్చిమ బెంగాల్) నిధులు వంటి అంశాలపై పార్లమెంటులో ప్రశ్నించాలని మాకు సూచనలు చేశారు. కానీ బిజేపీ ఈ అంశాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఇతర అనవసర అంశాలను తీసుకొస్తుంది. పైగా మాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వడం లేదు. ఒకవేళ చర్చ జరిగితే మేము తప్పకుండా బిజేపీ వైఫల్యాలపై నిలదీస్తామని వారి భయం. బిజేపీకి చైర్మెన్ జగ్దీప్ ధన్‌కర్ అండగా నిలబడుతున్నారు. అందుకే ఆయనకు వ్యతిరేకంగా నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రవేశ పెట్టం. ఇది రాజ్యాంగ బద్ధమే.. ఇది నిబంధనలకు వ్యతిరేకంగా కాదు.
మరో వైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు అదానీ అవినీతిపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ.. పార్లమెంట్ పరిసరాల్లో నిరసనలు చేస్తున్నాయి.