ఢిల్లీ కేంద్రంగా రేవంత్ కీలక మంత్రాంగం..!

ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీ పర్యటన ఆసక్తి కరంగా మారుతోంది. ఏడాది పాలన పూర్తి చేసుకున్న రేవంత్ జైపూర్ వెళ్లారు. అక్కడ వివాహానికి హాజరైన తరువాత ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర మంత్రు లను కలవనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టుల పైన చర్చించనున్నారు. ఆ తరువాత పార్టీ అధినాయకత్వంతోనూ రేవంత్ భేటీ కానున్నారు. మంత్రివర్గ విస్తరణ పైన మరోసారి చర్చ మొదలైంది. అదే విధంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశం చర్చించనున్నట్లు తెలుస్తోంది. రేవంత్ ఢిల్లీ టూర్ తరువాత రాష్ట్రంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

 

కేంద్ర మంత్రులతో భేటీ

సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలో కీలక అంశాల పైన నిర్ణయాలు జరిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండటంతో రేవంత్ అక్కడే కేంద్ర మంత్రులను కలవనున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి మద్దతు కోరుతూ ఇప్పటికే రేవంత్ పలు అంశాల పైన కేంద్రాన్ని కలిసారు. తాజా పర్యటనలో మరోసారి రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టుల అనుమతులు.. ఆర్దిక పరమైన అంశాల పైన చర్చించనున్నారు. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు అనుమతుల పైన రేవంత్ చర్చిస్తారని సమాచారం. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్ రేవంత్ కోరారు. వారితో వరుసగా సమావేశాలు జరగనున్నాయి.

 

హామీల అమలు

ఈ పర్యటనలోనే రేవంత్ పార్టీ ముఖ్య నాయకత్వంతో చర్చలు చేయనున్నారు. ఏడాది కాలంగా రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ పైన చర్చ జరుగుతోంది. రేవంత్ ఢిల్లీ వెళ్లిన ప్రతీ సందర్బంలో ఈ అంశం చర్చకు వస్తోంది. కాగా, రేవంత్ ఈ అంశం పైన ఆచి తూచి స్పందిస్తున్నారు. త్వరలో రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే రుణమాఫీ చేసిన రేవంత్ ప్రభుత్వం.. జనవరిలో సంక్రాంతి తరువాత రైతుభరోసా చెల్లించేలా ఆర్దిక వనరులను సమీకరించుకుంటోంది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో రైతుభరోసా అమలు అర్హతల పైన ప్రభుత్వం కీలక ప్రకటన చేయనుంది. సంక్రాంతి తరువాత రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని ఇప్పటికే రేవంత్ స్పష్టత ఇచ్చారు.

 

హైకమాండ్ తో చర్చలు

ఇక, రాజకీయ నియామకాల పైన రేవంత్ పార్టీ నాయకత్వంతో చర్చించనున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ పై కాంగ్రెస్ అధిష్ఠానంతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు. క్యాబినెట్ విస్తరణపై ఆశావహులు ఇప్పటికే ఎదురు చూస్తున్నారు. ఈ నెల 16న తిరిగి తెలంగాణ అసెంబ్లీ సమావేశా లు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో పాలనా పరంగా తీసుకొచ్చే కీలక మార్పులతో పాటుగా హైడ్రా అంశం పైన సభలో చర్చించనున్నారు. దీంతో పాటుగా రెవిన్యూ చట్టాల పైన నిర్ణయం తీసుకోనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ రేవంత్ తన ఢిల్లీ పర్యటనలో పార్టీ ముఖ్య నేతలతో మంత్రాంగం ఆసక్తి కరంగా మారుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *