తెలంగాణ ఒలింపిక్ సంఘం ఎన్నికల బరిలో మాజీ ఎంపీ, ప్రభుత్వ క్రీడాశాఖ సలహాదారుడు జితేందర్ రెడ్డి బరిలో నిలబడి విజయం సాధించారు. తెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడి స్థానానికి జితేందర్ రెడ్డితో పాటు తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వర్‌నాథ్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. అంతేకాదు, చాముండేశ్వర్‌నాథ్ ఉపాధ్యక్ష స్థానానికి కూడా నామినేషన్ వేశారు. అలాగే ప్రధాన కార్యదర్శికి మల్లారెడ్డి, బాబురావు, ప్రదీప్ కుమార్ నామినేషన్లు వేశారు.
ఈ నేపథ్యంలో జరిగిన ఎన్నికలలో మాజీ ఎంపీ, ప్రభుత్వ క్రీడాశాఖ సలహాదారుడు జితేందర్ రెడ్డి విజయం సాధించారు. జితేందర్ రెడ్డి ప్రత్యర్థి చాముండేశ్వర్ నాథ్ పై 34 ఓట్ల తేడాతో విజయం అందుకున్నారు. ఈ ఎన్నికలలో జితేందర్ రెడ్డికి 43 ఓట్లు రాగ, చాముండేశ్వర్ నాథ్ కు కేవలం 9 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఇంకా కార్యదర్శిగా మల్లారెడ్డి గెలుపు సాధించారు. ఈ పోటీలో మల్లారెడ్డికి 40 ఓట్లు, బాబురావుకు 12 ఓట్లు పోలయ్యాయి.