‘తెలంగాణ’ హామీని కాంగ్రెస్ నిలబెట్టుకోలేకపోవడం వల్లే కేసీఆర్ ఉద్యమించారు: హరీశ్ రావు..

తెలంగాణ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ 2004లో తమతో పొత్తు పెట్టుకుందని, కానీ హామీని నెరవేర్చకపోవడం వల్లే కేసీఆర్ ఉద్యమించాల్సి వచ్చిందని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. 2009లోపు తెలంగాణ రాష్ట్రం ఇచ్చి ఉంటే కేసీఆర్ ఉద్యమం చేసేవారు కాదన్నారు. సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… 2004 నుంచి 2014 వరకు రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉందని గుర్తు చేశారు.

 

కాంగ్రెస్ తెలంగాణ ఇస్తామన్న హామీని నెరవేర్చకపోవడంతో కేసీఆర్ నిరాహార దీక్షకు దిగారన్నారు. 2009 నవంబర్ 29న కేసీఆర్ దీక్ష చేయకుంటే కనుక డిసెంబర్ 9వ తేదీ నాటి ప్రకటనే ఉండేది కాదన్నారు. సోనియాగాంధీ దయతలిచి తెలంగాణ ఇచ్చారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఎవరి భిక్ష వల్లనో తెలంగాణ రాలేదని… కేసీఆర్, తెలంగాణ ప్రజల పోరాటం వల్ల వచ్చిందన్నారు.

 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు ఏనాడైనా ఉద్యమంలో పాల్గొన్నాడా? అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేయాలని నాడు జేఏసీ చైర్మన్ పిలుపునిస్తే రేవంత్ రెడ్డి చేయలేదని విమర్శించారు. ఉద్యమంలో పాల్గొనని రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ చరిత్రను మార్చాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *