ఇందిరమ్మ ఇళ్ల యాప్‌ ఆవిష్కరించిన సీఎం రేవంత్‌..

బీఆర్ఎస్‌ను ప్రజలు దూరం పెట్టినా ఆ పార్టీలో ఎలాంటి మార్పు రాలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మా ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లున్నారు. సభలో పాలకపక్షం- విపక్షం సమస్యలపై చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విపక్ష నేత సభకు రావడం లేదన్నారు.

 

సభకు వచ్చి పాలక పక్షాన్ని ఇరుకున పెట్టాలన్నారు సీఎం. మీ అనుభవాన్ని ప్రజల కోసం ఉపయోగించాలని సూచన చేశారు. ప్రభుత్వాన్ని అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నారా? అంటూ సున్నితంగా ప్రశ్నించారు. మీ పిల్లలిద్దర్నీ మా మీదకు వదలడం ఎంతవరకు కరెక్టని అన్నారు.

 

పెద్దరికం నిలుపుకునే బాధ్యత మీకు లేదా అని అన్నారు. గురువారం సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే మొబైల్ యాప్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఇళ్ల కేటాయింపులో అవినీతి, రాజకీయ ప్రమేయానికి ఆస్కార్ లేదని తెగేసి చెప్పేశారు.

 

పేదవాడి సొంతింటి కలను సాకారం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చింద న్నారు సీఎం రేవంత్. బస్తీల్లో ఉండే పేదవారు ఆత్మగౌరవంతో బతకడం అనేది వారి కల అని చెప్పారు. ఆనాడే ఈ విషయాన్ని ఇందిరాగాంధీ గుర్తించారన్నారు. గుడి లేని ఊరు ఉన్నదేమో కానీ.. ఇందిరమ్మ కాలనీ లేని గ్రామం దేశవ్యాప్తంగా ఎక్కడా లేదన్నారు.

 

అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాల వారి గౌరవాన్ని ఇందిరమ్మ పెంచిందన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు సాయం ప్రజా ప్రభుత్వంలో 5 లక్షలకు పెంచామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం మొబైల్‌ యాప్‌ ద్వారా శుక్రవారం నుంచి లబ్ధిదారుల నమోదు చేయనున్నారు.

 

ప్రతి మండల కేంద్రంలో మోడల్‌‌ హౌస్‌ ఏర్పాటు చేస్తారు. మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేయనున్నారు. ఆదివాసీ ప్రాంతాలకు అదనంగా ఉంటుందన్నారు. దివ్యాంగులు, ఒంటరి మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

 

గ్రామసభల్లో ఇందిరమ్మ కమిటీల ద్వారా అర్హుల ఎంపిక చేయనున్నారు. AI సాయం ద్వారా నిజమైన అర్హులకే ఇల్లు అందేలా చర్యలు చేపడతామన్నారు. ఇంటి నిర్మాణంలో ఎలాంటి డిజైన్లకు షరతులు లేవన్నారు. లబ్ధిదారుల వారికి అనుకూలంగా ఇల్లు నిర్మించుకోవచ్చన్నారు.

 

ఒక్కో నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున ఇవ్వనున్నారు. మహబూబ్ నగర్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్ జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్ట్‌గా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. తొలిదశలో 4.50లక్షల ఇళ్లు నిర్మిస్తామన్నారు. సొంత ఇల్లు అనేది ప్రతీ పేదవాడి కల అని, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థికసాయం చేస్తున్నామని తెలిపారు.

 

డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి మాజీ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానిస్తున్నట్లు చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు గొప్పదన్నారు. ప్రజా ఉద్యమం వచ్చినప్పుడు శక్తివంతుడైన నిజాం తలొగ్గిన విషయాన్ని వివరించారు.

 

తెలంగాణ రాష్ట్రంలో ప్రజల తీర్పు ఇచ్చారని, దాన్ని గౌరవించాలన్నారు. మొదటి ఆరు ఎన్నికల కోడ్‌తో సచివాలయానికి రాలేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్. ఈ ఐదునెలలు పరిపాలనను గాడిన పెడుతున్నామన్నారు.

 

హరీష్‌రావుకు, కేటీఆర్‌కు అవగాహన లేకపోవచ్చని, వారిది చిన్నపిల్లల మనస్తత్వమ న్నారు. వారిని పిలిచి కూర్చొబెట్టి తప్పని చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్‌కు లేదా అంటూ సున్నితంగా చెప్పుకొచ్చారు. ఎడముఖంగా వ్యవహరిస్తే ఎవరికీ, ముఖ్యంగా రాష్ట్రానికి మంచిది కాదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.

 

29 రాష్ట్రాల్లో తెలంగాణను మంచి సంప్రదాయంగా తీర్చిదిద్దామన్నారు. మా ప్రభుత్వం మిమ్మల్ని గుర్తిస్తుందన్నారు. మీరు.. మీ బాధ్యతల్ని నిర్వహించాలన్నారు. కుర్చీలో మమ్మల్ని చూడడం మీరు నామోషీగా ఫీలైతే.. కొంతకాలం స్వేచ్ఛగా పని చేసేలా మాకు అవకాశం ఇవ్వాలన్నారు. మీరు చేసే తప్పులను పక్కన పెడితే.. అప్పులు మోయడానికి నడుం వంగిపోతుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *