మాజీ సీఎం జగన్ కు వైఎస్ షర్మిళ ఝలక్ ఇచ్చారు. ఏకంగా ఏసీబీకి జగన్ పై షర్మిళ ఫిర్యాదు చేశారు. సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు చేసి, అవినీతి జరిగిందని తేలితే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. మొన్నటి వరకు కేవలం ఆరోపణలు గుప్పించిన షర్మిళ, ఇప్పుడు ఏకంగా ఫిర్యాదు చేయడం పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది.
ఏపీలో విద్యుత్ ఒప్పందానికి సంబంధించి అదానీ కంపెనీ నుండి రూ.1750 కోట్ల లంచం తీసుకున్నట్లు మాజీ సీఎం జగన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై గత కొద్దిరోజులుగా వైసీపీ లక్ష్యంగా విమర్శలకు పదును పెట్టారు కూటమి పార్టీ నేతలు. అలాగే వైఎస్ షర్మిళ కూడా, ఎలాగైనా ఈ విషయంపై వాస్తవాన్ని నిగ్గు తేల్చాలని పలుమార్లు డిమాండ్ చేశారు. కానీ జగన్ మాత్రం తనపై ఎవరైనా అబద్దపు వార్తలు ప్రసారం చేసినా, అవాస్తవ కామెంట్స్ చేసినా న్యాయపరంగా తాను వారిపై పోరాడుతానని ప్రకటించారు.
ఇలా జగన్ చేసిన కామెంట్స్ పై కూటమి, కాంగ్రెస్ భగ్గుమంది. తాజాగా జగన్ పై షర్మిళ ఏకంగా ఏసీబీకి ఫిర్యాదు చేశారు. అది కూడా విద్యుత్ ఒప్పందంలో జరిగిన స్కామ్ బయటకు తీయాలని, అసలు వాస్తవం ప్రజలకు తెలియాలని షర్మిళ ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం షర్మిళ మాట్లాడుతూ.. అమెరికా దర్యాప్తు సంస్థలే జగన్ స్కామ్ గురించి బయటపెడితే.. సీఎం చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆమె ప్రశ్నించారు. మొదట విమర్శలు చేసిన కూటమి, బీజేపీ దెబ్బకు భయపడి ప్రస్తుతం సైలెంట్ గా ఉండిపోయిందన్నారు.
అలాగే ఏసీబీ చేత సుమోటోగా స్వీకరించి విచారణ కొనసాగించాల్సిన భాద్యతను ప్రభుత్వం గుర్తించాలని ఆమె కోరారు. ఏసీబీ చేత విచారణ చేయించడంలో ప్రభుత్వం వెనుకడుగు వేస్తే, ఆదానీకి జగన్ కు మద్దతు పలికినట్లేనని సీరియస్ కామెంట్స్ చేశారు. ఏసీబీ ఎవరి కబంధ హస్తాల్లో ఉందో మీరే చూడండి అంటూ పంజరానికి ఏసీబీ అనే ఇంగ్లీష్ అక్షరాలను రాయించి మీడియా ముఖంగా షర్మిళ ప్రదర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో త్వరగా ప్రకటించాలని, లేనియెడల కాంగ్రెస్ తరపున తాము పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. మరి షర్మిళ చేసిన తాజా కామెంట్స్ పై కూటమి, వైసీపీ, మాజీ సీఎం జగన్ ఏవిధంగా స్పందిస్తారో వేచిచూడాలి.