అప్పుల్లో గ్రామీణ భారతం ఫస్ట్.. ప్రభుత్వ సర్వేలో షాకింగ్ నిజాలు..!

భారతదేశంలో మారుతున్న ఆర్థిక పరిస్థితులు, ఆదాయాలు ప్రజలపై విభిన్నమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. గతంలో ఎన్నడూ చూడని విధంగా ఈ డైనమిక్స్ మారటం కొంత ఆందోళనకు దారితీస్తోంది. ఈ క్రమంలో దేశంలోని ప్రజల రుణాల గురించి ప్రభుత్వం నిర్వహించిన తాజా సర్వే షాకింగ్ విషయాలను బయటపెట్టింది.

 

వివరాల్లోకి వెళితే.. సాధారణంగా గ్రామీణ ప్రజలు ఎక్కువగా సేవింగ్స్ పై మెుగ్గుచూపుతుంటారు. వీరు ఖర్చులను తక్కువగా ఉండేలా చూసుకుంటుంటారు. అయితే పట్టణ ప్రాంతాల్లో జీవనశైలి, నగరంలో ఉండే ఖర్చులతో పాటు అవసరాల కారణంగా ఇక్కడ నివశించే ప్రజలు సహజంగా అప్పులు తీసుకునేందుకు కొంత ఎక్కువగా సుముఖంగా ఉంటారు. అప్పులు తీసుకునే ధోరణి నగరాల్లో కంటే గ్రామీణ ప్రజల్లో అధికంగా ఉన్నట్లు షాకింగ్ రిపోర్టు ప్రభుత్వ సర్వేలో వెలుగులోకి వచ్చింది. గణాంకాలను పరిశీలిస్తే ప్రతి లక్ష మంది ప్రజల్లో గ్రామాల్లో 18,714 మందికి రుణాలు ఉండగా.. పట్టణ ప్రాంతాల్లో ఈ సంఖ్య 17,442గా ఉందని సమగ్ర వార్షిక మాడ్యులర్ సర్వే నివేదిక వెల్లడించింది.

 

దీనిని 2022-23 జాతీయ నమూనా సర్వే డేటా ఆధారంగా రూపొందించారు. దేశంలో ప్రతి లక్ష మందికి 18,322 మంది రుణగ్రస్తులు ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో సంస్థాగత, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ మార్గాల ద్వారా తీసుకున్న రుణాలు ఉంటాయి. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామాల్లోనే రుణాలు తీసుకునే వారి సంఖ్య స్త్రీ-పురుషులు ఇద్దరిలో ఎక్కువగానే కనిపిస్తుందని నివేదిక ద్వారా వెల్లడైంది. అలాగే గ్రామాల్లో వ్యవసాయం లేదా పెళ్లిళ్లు వంటి ఇతర అనేక కరణాలకు తెలిసినవారి వద్ద నుంచి ప్రామిసరీ నోట్లు రాసి డబ్బు తెచ్చుకుంటుంటారు. ఈ డేటా అందుబాటులో ఉండదు కాబట్టి గణాంకాలు తక్కువగా ఉన్నాయి. వీటిని కూడా పరిగణిస్తే గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులు మరింత దారుణంగా ఉండొచ్చని అంచనావేయబడుతోంది.

 

గ్రామాల్లోని ప్రతి లక్ష మంది మహిళల్లో 13,016 మంది మహిళలు అప్పుల పాలయ్యారని, ఇదే విషయాన్ని నగరాల్లో పరిశీలిస్తే 10,584 మందితో తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. అయితే గ్రామాల్లో రుణాలు తీసుకుంటున్న వారి సంఖ్య పెరగటానికి ప్రధాన కారణాలను పరిశీలిస్తే.. ప్రజలు నగరాల్లోని ప్రజల మాదిరిగానే తమ జీవనశైలిని అప్‌గ్రేడ్ చేసుకోవటం, ఇల్లు, పిల్లల చదువులు, దుస్తులు, ఆహారం వంటివాటిపై నగరవాసులతో పోటీపడుతున్నట్లు సర్వేలో గమనించబడింది. గ్రామాల్లో ప్రజలు విద్య, ఆరోగ్యం వంటి వాటిపై ఖర్చుచేసేందుకు రుణాలను పొందుతున్నట్లు కూడా గమనించబడింది. అలాగే చాలా మంది గ్రామీణుల పిల్లలు నగరాల్లో జాబ్ చేయటం వల్ల వారికి రుణ లభ్యత సులభతరమైందని కూడా తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *