టీడీపీ ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉంది. ఏపీ విషయంలోనూ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తోంది. ఏపీ వినతులకు సానుకూలంగా స్పందిస్తోంది. అమరావతి, పోలవరం విషయంలో పూర్తిగా సహకరిస్తోంది. ఇప్పుడు టీడీపీకి తాజాగా బీజేపీ ముఖ్య నాయకత్వం నుంచి గవర్నర్ పదవి పైన ఆఫర్ వచ్చింది. దీంతో, ముగ్గురు నేతలు ప్రధానంగా ఈ పదవి కోసం పోటీలో ఉన్నారు. కాగా, టీడీపీ నుంచి ఇప్పుడు ఈ పదవి కోసం చంద్రబాబు ఎవరి పేరు ఎంపిక చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.
ఛాన్స్ దక్కేదెవరికి
టీడీపీ నుంచి గవర్నర్ అయ్యే అవకాశం దక్కేదెవరికి. ఇప్పుడు పార్టీలో ఈ అంశం ప్రధాన చర్చగా మారుతోంది. కేంద్రం కొత్త గవర్నర్ల నియామకం పైన కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా టీడీపీ నుంచి గవర్నర్ గా అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం ఇచ్చింది. దీంతో, గవర్నర్ పదవి కోసం తమ పార్టీ నేతను చంద్రబాబు ఎంపిక చేయాల్సి ఉంది. టీడీపీ నుంచి ఇద్దరి పేర్లు ప్రముఖంగా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఛాయిస్ రేసులో సీనియర్ నేతలు అశోక్ గజపతిరాజు, యనమల ఉన్నాయి. కాగా, తాజాగా మరో సీనియర్ నేత వర్ల రామయ్య పేరు తెర మీదకు వచ్చింది. దీంతో..ఇప్పుడు ఈ ముగ్గురిలో చంద్రబాబు ఛాయిస్ ఎవరో తేలాల్సి ఉంది.
రేసులో ఆ ముగ్గురు
అశోక్ గజపతి రాజు, యనమల తొలి నుంచి టీడీపీలో కీలకంగా వ్యవహరించారు. చంద్రబాబుకు తోడుగా నిలిచారు. ఇద్దరూ అసెంబ్లీ స్పీకర్లుగా..ఆర్దిక మంత్రులుగా వ్యవహరించారు. అశోక్ గజపతి రాజు కేంద్రంలోనూ టీడీపీ మంత్రిగా పని చేసారు. ప్రస్తుత ప్రభుత్వం లో ఇద్దరికీ ప్రాతినిధ్యం లేదు. ఇద్దరి కుమార్తెలు టీడీపీ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి ఇస్తే..యనమలకు రాజ్యసభ అవకాశం దక్కుతుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. అదే విధంగా వర్ల రామయ్య పేరు పైనా చర్చ జరుగుతోంది. గతంలో రాజ్యసభ అభ్యర్ధుల ఖరారు విషయంలో చివరి వరకు వర్ల రామయ్య పేరు తెర మీద ఉండటం..చివరి నిమిషంలో మరొకరికి దక్కటం జరిగింది. దీంతో, వర్ల రామయ్య కు ఎంత వరకు ఛాన్స్ ఉంటుందనేది తేలాల్సి ఉంది.
చంద్రబాబు నిర్ణయం
ఇప్పుడు ఈ ముగ్గురి పేర్లనే చంద్రబాబు పరిశీలిస్తారా.. అనూహ్యంగా కొత్త పేరును ఎంపిక చేస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. గతంలో ఎన్డీఏ హయాంలో టీడీపీకి స్పీకర్ గా అవకాశం వస్తే నాడు చంద్రబాబు స్పీకర్ గా బాలయోగి పేరు ఖరారు చేసారు. అదే విధంగా ఇప్పుడు ఏపీలో సామాజిక సమీకరణాలు రాజకీయంగా కీలకంగా మారాయి. బీసీ, ఎస్సీ వర్గాలకు పార్టీ నుంచి గవర్నర్ పదవి కి చంద్రబాబు సిఫార్సు చేసే అవకాశం ఉందనే అంచనా వ్యక్తం అవుతోంది. అయితే, అశోక్ గజపతి రాజు అందరికీ ఆమోదయోగ్య మైన నేత కావటంతో ఆయనను కాదనలేని పరిస్థితి. దీంతో, చంద్రబాబు గవర్నర్ విషయంలో పార్టీ పోలిట్ బ్యూరోలో చర్చించిన తరువాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఫైనల్ గా ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది పార్టీలో ఆసక్తి కరంగా మారింది.