దేశవ్యాప్తంగా ఒకేసారి జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న కేంద్రం మరో అడుగు వేసింది. ఇప్పటికే జమిలి ఎన్నికల నిర్వహణకు వీలుగా కేంద్ర కేబినెట్ లో ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో తదుపరి చర్యలపై ఫోకస్ పెట్టింది.
ఇందులో భాగంగా పార్లమెంట్ లో ప్రవేశపెట్టాల్సిన బిల్లుల్ని సిద్ధం చేస్తోంది. వీటి వివరాలు కూడా దాదాపుగా బయటికి వచ్చాయి. ఈ బిల్లుల్ని త్వరలో పార్లమెంట్ లో ఆమోదిస్తే ఇక జమిలి లాంఛనమే.
జమిలి ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం మూడు బిల్లుల్ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఆమోదించేందుకు కేంద్రం సిద్దమవుతోంది. ఇందులో ప్రధానమైనది లోక్ సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీ పదవీకాలం ఒకేసారి ప్రారంభించి, ఒకేసారి ముగిసేలా రాజ్యాంగ సవరణ చేసే బిల్లు. దీనికి రాజ్యాంగంలోని 82ఏ అధికరణకు రెండు సబ్ క్లాజ్ లు, అలాగే 83(2) అధికరణకు రెండు సబ్ క్లాజ్ లు చేరుస్తారు. అలాగే జమిలి ఎన్నికల పదం ఇందులో వచ్చి చేరుతుంది. వీటికి కనీసం సగం రాష్ట్రాల ఆమోదం కూడా అవసరం లేదని రామ్ నాథ్ గోవింద్ కమిటీ ఇప్పటికే తేల్చేసింది.
అలాగే రెండో రాజ్యాంగ సవరణ రాష్ట్రాల్లో స్థానిక సంస్థల నిర్వహణకు సంబంధించినది. జమిలి ఎన్నికలు పూర్తయిన 100 రోజుల్లో రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికల నిర్వహణకు వీలుగా మరో రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదిస్తారు. దీనికి మాత్రం సగం రాష్ట్రాల ఆమోదం తప్పనిసరి. ఇక మూడో బిల్లులో రాష్ట్ర హోదా కలిగిన కేంద్ర పాలిత ప్రాంతాలు ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీల చట్టాల్ని సవరించేది. దీనికి కూడా ఇతర రాష్ట్రాల ఆమోదంతో సంబంధం లేదు. ఈ మూడు బిల్లుల్ని త్వరలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. పార్లమెంట్ ఆమోదం తర్వాత రాష్ట్రపతి ఆమోదం లాంఛనమే.