ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తిరుమల లడ్డూ వ్యవహారంపై న్యాయస్థానం చేసిన కామెంట్స్‌తో అధికార- విపక్షం మధ్య రాజకీయ వాతావరణం తారాస్థాయికి చేరింది. బీజేపీ నేత సుబ్రహణ్యస్వామి తరపు న్యాయవాది చేసిన ఆర్గ్యుమెంట్‌పై సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు లేవనెత్తింది. లడ్డూ వ్యవహారం ముగిసిపోలేదని, వైసీపీ కష్టాలు ఉన్నాయని అంటున్నారు రాజకీయ నిఫుణులు. కేవలం సీఎం చేసిన కామెంట్స్‌పై న్యాయస్థానం మాట్లాడినట్టు చెబుతున్నారు.
తిరుమల లడ్డూ వివాదంపై పిటిషన్ లేవనెత్తిన అంశాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారంపై గతరాత్రి టీవీ ఛానెళ్లలో డిబేట్లు పెట్టారు. ఇందులో రాజకీయ నేతలు, విశ్లేషకులు, న్యాయ నిఫుణులు సైతం పాల్గొన్నారు. ఎవరి అభిప్రాయాలను వారు ప్రస్తావించారు. లడ్డూ వ్యవహారంపై వైసీపీ నేతలకు టెన్షన్ ఇంకా వుందని కంక్లూజన్‌లో చెప్పుకొచ్చారు.
వైసీపీ అధికార గెజిట్ తాటికాయంత అక్షరాలతో హెడ్ లైన్ బ్యానర్ ఐటమ్ రాసుకొచ్చింది. ‘ఎలాంటి ఆధారాల్లేవు’ అంటూ పేర్కొంది. సిట్ విచారణ ఆపమని న్యాయస్థానం ఎక్కడా ప్రస్తావించలేదు. సీఎం చేసిన కామెంట్స్‌తో సిట్ ప్రభావితం అవుతుందనేది అసలు పాయింట్.
తమ విశ్వాసాలకు ముడిపడిన అంశం కావడంతో సిట్ విచారణ కాకపోయినా, సీబీఐ లేదంటే జ్యుడీషియల్ విచారణ అయినా జరిపించే అవకాశం ఉందని అన్నారు కొందరు న్యాయ నిఫుణులు. ఈ వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్.. ప్రధానికి రాసిన లేఖలో సీబీఐ, జ్యుడీషియల్ విచారణ చేయించాలని ఎక్కడా ప్రస్తావించలేదు.
దర్యాప్తుకు వైసీపీ నేతలు భయపడుతున్నట్లేనని కొందరి వాదన. ఎందుకంటే కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాలు ఉండడంతో సీబీఐ విచారణకు అంగీకరించరని అంటున్నారు. లేదంటే జ్యుడీషియల్ విచారణకు వెళ్లే అవకాశముందన్నది రాజకీయ విశ్లేషకుల వాదన.
జూన్‌లో టీటీడీకి కొత్త ఈవో వచ్చారు. అక్కడి సిబ్బంది ఫిర్యాదు మేరకు కొత్తగా వచ్చిన ఈవో విజిలెన్స్ విచారణ చేపట్టారు. లడ్డూ విషయంలో అనుమానాలు లేవనెత్తింది. దీంతో నెయ్యిని ల్యాబ్‌కు తరలించి పరీక్షలు నిర్వహించింది. అందులో వచ్చిన రిపోర్టుపై సీఎం నోరు విప్పారు. ఆ తర్వాత ప్రత్యేకంగా సిట్ విచారణకు ఆదేశించింది.
లడ్డూపై కెమికల్ ఇంజనీర్లు ఏమంటున్నారు?
తిరుమల నెయ్యిలో కల్తీ జరిగింది నిజమని అంటున్నారు కెమికల్ ఇంజనీర్ల నిపుణులు. వెన్న నుంచి తీసిన నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ ఉంటుందని అంటున్నారు. ఎన్‌డీబీబీ రిపోర్టులో నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ లేదని తేల్చింది.
వెన్న నుంచి నెయ్యి తీయలేదని ఇక్కడ అర్థమైంది. లారిక్ యాసిడ్ 12 శాతం కనిపించింది. ఈ తరహా యాసిడ్ కొబ్బరి నూనెలో ఉంటుంది. కొబ్బరి.. జంతువులకు పెట్టినా అది కేవలం నాలుగైదు శాతం మాత్రమే వస్తుందని అంటున్నారు. లారిక్ యాసిడ్ మార్కెట్లో తక్కువ రేటు వస్తుందని అంటున్నారు.
రిపోర్టులో కోకోనట్ లేదా పామ్ కెర్నిల్ కలిసి ఉంటుందని ప్రస్తావించింది. బ్యూట్రిక్ యాసిడ్ లేకపోవడంతో కల్తీ జరిగిందన్నది కెమికల్ నిపుణుల మాట. మాములుగా డెయిరీల్లో పచ్చి పాల నుంచి తీసే ఆవు నెయ్యిలో పాల్మిటిక్ యాసిడ్ (Palmitic acid) 22-25% మాత్రమే ఉంటుంది. రిపోర్ట్‌లో 40% ఉందని తేలింది. ఇక్కడ కూడా కల్తీ జరిగిందని అంటున్నారు.
పాల్మిటిక్ యాసిడ్ 40% రావాలంటే పాం ఆయిల్ లేదా జంతువుల కొవ్వు కలిపితే వస్తుందని రిపోర్టు చెబుతోంది. పాల్మిటిక్ యాసిడ్ 40% రావటానికి ఏఆర్ డెయిరీ ఏమి వాడిందనేది సిట్ అధికారులు తేల్చితే ఈ విషయం తేలిపోతుంది.
పాం ఆయిల్ రేటు.. పంది కొవ్వు కంటే ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. పాల్మిటిక్ యాసిడ్ కోసం పాం ఆయిల్ వాడారా ? జంతువుల కొవ్వు వాడారా అనేది తేలనుంది. 40 శాతం పాల్మిటిక్ యాసిడ్ సోర్స్ ఏంటి ? అన్నది తెలిస్తే.. నెయ్యి గుట్టు రట్టు కానుందని నిపుణుల మాట.