ఆ స్కీమ్ వెనుక భారీ అవినీతి..? ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌పై కేసు..!

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) శాఖ, బిజేపీ అధికారులకు వ్యతిరేకంగా బెంగుళూరు పోలీసులు కేసు (ఎఫ్ఐఆర్) నమోదు చేశారు. ఎలెక్టోరల్ బాండ్స్ స్కీమ్ ద్వారా అవినీతికి పాల్పడ్డారని కర్ణాటకకు చెందిన సామాజిక కార్యకర్త ఆదిత్య అయ్యార్ బెంగుళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కర్ణాటకకు చెందిన జనాధికార సంఘర్ష పరిషత్ (జెఎస్‌పి) అనే ఎన్‌జివో లో ఆదిత్య అయ్యార్ కార్యకర్తగా ఉన్నారు. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎలెక్టోరల్ బాండ్స్ డేటా పరిశీలిస్తే.. బాండ్స్ కొనుగోలు ద్వారా రాజకీయ పార్టీలకు చందా ఇచ్చిన వారిపై ఇన్ కం ట్యాక్స్ రైడ్స్, ఈడీ రైడ్స్ జరిగాయి. ఈ రైడ్స్ జరిగిన తరువాతనే వారంతా ఎలెక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేశారు. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ వారిపై రైడ్స్ చేయించి ఒత్తిడి చేసింది. అందుకే వారంతా ఎలెక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేశారని ఆదిత్య అయ్యర్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

 

లోక్ సభ ఎన్నికలకు ముందు సుప్రీం కోర్టు ఈ ఎలెక్టోరల్ బాండ్స్.. రాజ్యాంగ విరుద్ధమని తీర్పు నిచ్చిన నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మాల సీతారామన్, బిజేపీ, ఈడీ అధికారులపై ఈ కేసు నమోదు చేసినట్లు ఆదిత్య అయ్యర్ తెలిపారు. మీడియాతో ఆదిత్య అయ్యర్ మాట్లాడుతూ.. ”కొన్ని బడా కార్పొరేట్ కంపెనీలు, వాటి యజమానులపై ఈడీ, ఇన్ కం ట్యాక్స్ రైడ్స్ జరిగాయి. వారందరూ బిజేపీకి చందా ఇవ్వడానికి ఎలెక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేసిన తరువాత ఈ రైడ్స్, విచారణ ఆగిపోయాయి. ఇది ఒకరకమైన బ్లాక్ మెయిలింగ్.. ఎక్స్‌టార్షన్ కిందకు వస్తుంది. చట్టపరంగా బిజేపీ, ఈడీకి వ్యతిరేకంగా మరిన్ని చర్యలు తీసుకునే ఆలోచనలో ఉన్నాను.” అని చెప్పారు.

 

అయితే ఆదిత్య అయ్యర్ ఇంతుకుముందు మార్చి నెలలోనే ఈ కేసు నమోదు చేయాలని ప్రయత్నించారు. కానీ పోలీసులు అందుకు అంగీకరించలేదు. దీంతో సామాజిక కార్యకర్త అయిన ఆదిత్య కోర్టులో పిటీషన్ వేశారు. ఎలెక్టోరల్ బాండ్స్ అవినీతిపై తన ఫిర్యాదు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలివ్వాలని కోర్టును ఆదిత్య కోరారు.

 

తాజాగా ఆదిత్య నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో నిందితులుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, బిజేపీ నాయకులు జేపీ నడ్డా, నలిన్ కుమార్ కటిల్, కర్ణటాక బిజేపీ అధ్యక్షుడు విజయేంద్ర , ఆదాయ పన్ను విభాగం, ఈడీ అధికారులు ఉన్నారు. వీరంతా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపించారు. ఈడీ, ఆదాయపు పన్ను విభాగాలను బిజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వియోగం చేసిందని ఎఫ్ఐఆర్ లో ఆదిత్య పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ లో వేదాంత కంపెనీ, అరబిందో ఫార్మా కేసుని ఉదాహరణగా చూపించారు. అరబిందో ఫార్మాపై ఆర్థిక నేరాల ఆరోపణలు ఉండగా.. ఈడీ విచారణ ప్రారంభించింది. కానీ అరబిందో ఫార్మా యజమాని బిజేపీకి రూ.49.5 కోట్ల ఎలెక్టోరల్ బాండ్స్ కొనుగోలు ద్వారా విరాళం ఇవ్వగానే విచారణ ఆగిపోయింది. ఇలాంటివి ఇంకా 14 ఎలెక్టోరల్ బాండ్స్ ఎక్స్ టార్షన్ కేసులు ఉన్నాయని ఆదిత్య తెలిపారు.

 

ఆదిత్య ఎఫ్ఐఆర్ నమోదుపై దేశంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ స్పందించింది. ఆదిత్య నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో తమ ప్రమేయం ఏమీ లేదని కాంగ్రెస్ నాయకులు అభిషేక్ మను సింఘ్వి, జైరామ్ రమేష్ తెలిపారు.

 

అయితే ఎలెక్టోరల్ బాండ్స్ ద్వారా అవినీతి జరిగిందని.. అందుకు నిర్మలా సీతారామన్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని కర్ణాటక కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. దేశంలో పారదర్శకంగా ఎన్నికలు జరగలేదనడానికి.. ఎలెక్టోరల్ బాండ్స్ ఎక్స్ టార్షన్ ఉదాహరణ అని.. దీనిపై చట్టపరంగా పోరాడుతామని కాంగ్రెస్ నాయకులు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *