జమ్మూకశ్మీర్‌లో మరోసారి కాల్పులు చోటుచేసుకున్నాయి. కుల్గాం జిల్లా ఆదిగామ్ గ్రామంలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ భీకర కాల్పుల్లో ముగ్గురు ఆర్మీ సిబ్బందితోపాటు మరో పోలీసు అధికారి గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. వెంటనే గాయపడిన భద్రతా సిబ్బందిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో ఆర్మీ సిబ్బంది తనిఖీలు చేపట్టింది. పోలీసులు, భద్రతా దళాలు కలిసి సెర్చ్ ఆపరేషన్ చేస్తుండగా.. ఒక్కసారిగా ఉగ్రవాదులు ఎదురుపడ్డారు. దీంతో దేవ్ సర్ ప్రాంతంలో ఉగ్రవాదులపై భద్రతా దళాలు కాల్పులు జరిపింది. ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పులు జరిగిన వెంటనే ఉగ్రవాదులు పారిపోయారు.
ప్రస్తుతం ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో ఇంటింటికి వెళ్లి సోదాలు నిర్వహించారు. ఈ సమయంలోనే ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. అంతకుముందు సెప్టెంబర్ 15వ తేదీన పూంచ్ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలు ఎదురుకాల్పులకు పాల్పడ్డారు.